నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్లులను శాసనసభ ముందు ఉంచనున్నారు. అందులో ఆడిట్ రిపోర్టు, ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులు ఉన్నట్టు సమాచారం. అనంతరం ప్రశ్నోర్థరాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి.
అసెంబ్లీ ప్రారంభానికి ముందే ఉదయం 8:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సభ వేదికగా పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని నిన్న నిర్వహించిన భేటీలో బీజేపీఎల్పీ నిర్ణయానికి వచ్చింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, 22A, రైతు సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సభ 10 గంటకు ప్రారంభమైన కాసేపటికే ప్లకార్డులు ప్రదర్శించి పెండింగ్ సమస్యలపై చర్చ జరపాలని అధికారపక్షాన్ని డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆరు గ్యారెంటీలు, రైతులకు సాగు నీరు, యూరియా సప్లయ్, బకాయిలు విడుదల అంశాలపై చర్చ జరిపేదాక అధికారపక్షాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు సమాచారం.ప్రశ్నోర్థరాల సమయంలో మైక్ ఇవ్వకపోయినా సభను సజావుగా జరగనివ్వకూడదని, నిరసన తెలుపుతూనే ఉండాలని నిన్నటి బీజీఎల్పీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా,ఇదే అంశాలపై బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ వేదికగా అధికార పక్షం తీరును ఎండగట్టాలని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు తెలిసింది.












