హైదరాబాద్ నగరవాసులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఇకపై వేర్వేరు టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే ఉమ్మడి పాస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
గతంలో ఈ కాంబినేషన్ పాస్ ప్రతిపాదన పలుమార్లు చర్చకు వచ్చినప్పటికీ, రవాణా సంస్థల మధ్య సమన్వయం కుదరక కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇటీవల మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రయాణ చార్జీల సమన్వయాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసి, ఈ విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉమ్మడి పాస్ అమల్లోకి వస్తే నగర ప్రయాణికులకు గొప్ప వెసులుబాటు లభించనుంది. రోజువారీ, నెలవారీ ప్రాతిపదికన జారీ చేసే ఈ పాస్‌ల వల్ల బస్సు, మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం క్యూలలో నిలబడే శ్రమ తప్పుతుంది. సమయం ఆదాతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. చార్జీల ఖరారు ప్రక్రియ పూర్తి కాగానే అధికారులు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళలు రోజు రోజుకు పెరుగుతుండటం వల్ల బస్సులు రద్దీతో నిండిపోతున్నాయి.
దీని వల్ల బస్ పాస్ కలిగిన ప్రయాణికులతో పాటు టికెట్ కొన్న వారికి సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక దూరప్రాంతాల్లో ఉద్యోగం చేసే వారు ఒకవేళ మెట్రోకు వెళ్లాలన్న చార్జీలు మోత మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే కంబైన్డ్ పాస్ వల్ల ఎంతో వెలుసుబాటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతుంది.












