తెలంగాణ

నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ఉదయం 9 గంటలకు సచివాలయంలో నూతనంగా నిర్మించిన 'అసెంబ్లీ సెంట్రల్ హాల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ఉదయం 9 గంటలకు సచివాలయంలో నూతనంగా నిర్మించిన 'అసెంబ్లీ సెంట్రల్ హాల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సభ ప్రారంభం కాకముందే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో, ఈ సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చ సాగుతుందా లేక గందరగోళం, నిరసనలతో రచ్చ నెలకొంటుందా? అనేది ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈ సమావేశాలను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తమ 1000 రోజుల పాలనా ఘనతలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక చర్చకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. సభలో ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ వార్షిక నివేదికలతో పాటు విద్యా రంగానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను సభ ముందు ఉంచనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనతో పాటు అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సర్వసిద్ధమైంది. ప్రతిపక్షాలు సంధించే విమర్శలను తిప్పికొట్టేందుకు మంత్రులు, అధికార ఎమ్మెల్యేలకు సీఎం పక్కా గణాంకాలతో దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు 'బాకీ కార్డుల' వ్యూహంతో సభలోకి అడుగుపెట్టింది. భూముల నిషేధిత జాబితా (22A) వివాదం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, రైతాంగ సమస్యలు, కృష్ణా నదీ జలాల వినియోగంలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ నాన్చివేత, ప్రభుత్వ హామీల అమలులో నిరసనగా సభలో సమరానికి సై అంటోంది.

ఈ సభా పోరుకు మరింత ఆజ్యం పోసేలా అసెంబ్లీకి విపక్ష నేత కేసీఆర్ గైర్హాజరీ అంశం మారింది. సభకు రాకుంటే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే మహాధర్నా చేపట్టగా, సభలో అనుచిత వ్యాఖ్యలు వినాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరస్పర సవాళ్లు, ఆరోపణలతో ముగిసిన ముందస్తు వ్యూహాల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏ మేరకు సజావుగా సాగుతాయో వేచి చూడాలి.

#TelanganaAssembly2026#RevanthReddy#BRSVsCongress#KCR#TelanganaPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి