International

నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

యెమెన్ రాజ్యాంగంలో తీవ్ర ఉద్రిక్తతలు మళ్లీ చోటుచేసుకున్నాయి. పశ్చిమ ప్రావిన్సులైన తాయిజ్, హోదైదా ప్రాంతాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ దళాలకు, ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య గత నాలుగు రోజులుగా భీకర భూతల పోరాటం సాగుతోంది.

 యెమెన్ రాజ్యాంగంలో తీవ్ర ఉద్రిక్తతలు మళ్లీ చోటుచేసుకున్నాయి. పశ్చిమ ప్రావిన్సులైన తాయిజ్, హోదైదా ప్రాంతాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ దళాలకు, ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య గత నాలుగు రోజులుగా భీకర భూతల పోరాటం సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులు ఒక్కసారిగా రణరంగంగా మారడంతో దేశంలో మళ్లీ పూర్తిస్థాయి అంతర్యుద్ధం చెలరేగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తాజా ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 117 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.

వైద్య వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గురువారం నాటి నుంచి ప్రారంభమైన ఈ భీకర దాడుల్లో 54 మంది ప్రభుత్వ సైనికులు అమరులయ్యారు. మరోవైపు, హోదైదాలోని హౌతీల ఆధీనంలో ఉన్న ఆస్పత్రుల లెక్కల ప్రకారం 63 మంది హౌతీ తిరుగుబాటుదారులు మరణించారు. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బాబ్ అల్-మందబ్ జలసంధి, ఎర్ర సముద్ర తీర ప్రాంతాలను దక్కించుకోవడమే లక్ష్యంగా హౌతీలు క్షిపణులు, డ్రోన్లు, భారీ ఫిరంగులతో విరుచుకుపడ్డారు.

హౌతీలు ప్రారంభించిన ఈ ఊహించని దాడిని తిప్పికొట్టేందుకు యెమెన్ సైనిక దళాలు మెరుపు వేగంతో ఎదురుదాడికి దిగాయి. యెమెన్ ప్రభుత్వ యుద్ధ విమానాలు హోదైదా, తాయిజ్ ప్రావిన్సుల్లోని హౌతీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో గురువారం హౌతీల హస్తగతమైన పలు కీలక కొండ ప్రాంతాలను, పోస్టులను యెమెన్ దళాలు తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి.

2022లో ఐక్యరాజ్యసమితి (UN) కుదిర్చిన సంధి తర్వాత పశ్చిమ యెమెన్‌లో ఈ స్థాయి అత్యంత తీవ్రమైన పోరు జరగడం ఇదే ప్రథమమని సైనిక నిపుణులు చెబుతున్నారు. 2014 చివర్లో హౌతీలు రాజధాని సనాతో పాటు ఉత్తర యెమెన్‌ను ఆక్రమించడంతో ప్రారంభమైన ఈ పోరులో 2015నుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. తాజా పరిణామాలు యెమెన్‌లో మళ్లీ రక్తాన్ని పారిస్తున్నాయి.

 

#YemenConflict#Houthis#TaizClashes#Hodeidah#YemenNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి