ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కోసం తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.
తాజా షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత ఉన్నవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు.
సెప్టెంబర్ 25, 26 తేదీల్లో అర్హులైన వారి దరఖాస్తులకు తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశలవారీగా కొత్త పింఛన్లను మంజూరు చేసి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద నెలకు 4 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి సంబంధించి పలు కీలక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్‌లోని పథకాలను అమలు చేస్తోంది.
విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం కింద అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. మహిళలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తోంది. అలాగే దీపం 2.0 కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తోంది.
అదే సమయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మహిళలు, రైతులు, విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసిన వారిని ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది వెరిఫికేషన్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. కాబట్టి అర్హత ఉన్నవారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం కీలకం..












