TG: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.
హైదరాబాద్‌లో 200 ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్కో ఏర్పాటు చేసిన 200 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఎంపికైన సీపీఓలు వీటి నిర్వహణ, మెయింటెనెన్స్, అప్‌గ్రేడేషన్, వాణిజ్య కార్యకలాపాలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కాలపరిమితిని 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 169 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
యూనిట్‌కు రూ.13 ఛార్జింగ్ టారిఫ్
రెండు ప్రాజెక్టుల్లోనూ ఈవీ వినియోగదారులకు ఛార్జింగ్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.13గా (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. కాంట్రాక్ట్ కాలం మొత్తం ఇదే టారిఫ్ అమల్లో ఉంటుందని టీజీ రెడ్కో వీసీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పష్టం చేశారు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు అనుగుణంగా ప్రైవేట్ రంగం అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో సమగ్ర ఈవీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లకు (సీపీఓలు) అప్పగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాటికి అనుగుణంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
సెప్టెంబర్ 8 నుంచి బిడ్ల స్వీకరణ
169 ఛార్జింగ్ స్టేషన్ల ప్రాజెక్టుకు సెప్టెంబర్ 7న ఉదయం 11.30 గంటలకు, 200 ఛార్జింగ్ స్టేషన్ల ప్రాజెక్టుకు అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రీ-బిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు టీజీ రెడ్కో వీసీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. బిడ్ల సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగుస్తుందన్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనదారులకు పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.









