TG: కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నేత హోదాకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయవద్దని సూచించారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రతిపక్ష నేత పదవిని మరొకరికి అప్పగించాలన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఉద్యమకారుల కుటుంబాలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు పోరాడారని మహేశ్‌కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల పోరాట ప్రయోజనాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు. ఉన్నత చదువులతో పాటు సంస్కారం కూడా అవసరమని, కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కృషితో హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. నగరానికి అనుబంధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతూ మరో గొప్ప నగరంగా ఎదుగుతోందని వెల్లడించారు. పేదల సొంతింటి కలను గత పదేళ్లలో బీఆర్ఎస్ వాళ్లు నెరవేర్చలేకపోయారని మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.








