తెలంగాణ రాజకీయాలు ఇక నుండి మరింత హీట్ ఎక్కేలా కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయం మళ్లీ పీక్స్‌కు చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు ఊహించని ఎత్తుగడలతో వ్యూహాలకు పదును పెట్టారు. ఇన్నాళ్లూ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ, నేరుగా కాంగ్రెస్ సర్కార్ వైఫ్యల్యాలపై రణభేరి మోగించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందంటూ గళమెత్తిన గులాబీ అధినేత, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఏకంగా లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శిస్తానని ప్రకటించి హస్తం నేతలకు షాక్ ఇచ్చారు.
అంతేకాదు, 'నీళ్ల కోసం పాదయాత్ర' పేరిట భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకవైపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను కడిగిపారేయడం, మరోవైపు రోడ్డెక్కి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం అనే ద్వంద్వ వ్యూహంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మొదలవుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంతో పాటు, ఓటమితో డీలా పడిన తన క్యాడర్‌లో నూతన ఉత్సాహం నింపడమే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యంగా తెలుస్తుంది.
ఇన్నాళ్లూ కేసీఆర్ మౌనాన్ని బలహీనతగా భావించిన కాంగ్రెస్ నాయకులకు, ఈ సరికొత్త ఆపరేషన్ పెద్ద సవాలుగా మారనుందనే చర్చలు అప్పుడే మొదలైయ్యాయి.. ఇక రానున్న రోజుల్లో సాగునీటి అంశం పై కేసీఆర్ వేస్తున్న ఈ పావులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త కోణాన్ని చూపించబోతున్నాయా? అనేలా సాగుతాయని అంతా భావిస్తున్నారు.. మరోవైపు గతంలో కూడా కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి.. సమస్యలపై పోరాడుతా అని పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చి మళ్ళీ ఫామ్‌హౌస్ కే పరిమితం అయిన సందర్భాలున్నాయి..
తాజాగా నీళ్ల కోసం త్వరలోనే భారీ పాదయాత్ర కూడా చేపడతానని ప్రకటించడం.. గత నేపథ్యాన్ని గమనిస్తే కాస్త విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ.. ఇప్పటి నుంచి ప్రజల్లో యాక్టివ్ కాకుండా.. కేవలం ప్రకటనలకే పరిమితమైతే రాజకీయంగా ఎదురుదెబ్బ తప్పదనే భావనతోనే ఆయన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాదయాత్రతో ప్రజల్లో ఎంతవరకు స్పందన తీసుకురాగలరు.. ఆయన రాజకీయ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.










