బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై ఆయన సీరియస్ అయ్యారు. అడ్డంకులు సృష్టిస్తే ఆమరణ దీక్ష చేస్తానని సంచలన హెచ్చరికలు పంపారు. ఇంతకీ ఆయన ఇలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చారో తెలుసుకుందాం..
గత ఎన్నికల ముందుకు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహించనుంది.మరికొద్దిసేపట్లో అది ప్రారంభంకానుంది. ఈ సదస్సుకు అధికారులు అనుమతులు నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి మరీ పర్మిషన్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సైతం హౌస్ అరెస్టు చేశారు.దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు.‘ఇవాళ ఉదయం నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్‌లో సభ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘యువ సంగ్రామ సదస్సు’కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అక్కడకు వెళ్లాలని చెప్పినా మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని, మిమ్మల్ని బయటకు వెళ్లనివ్వబోమని మల్కాజిగిరి పోలీసులు అంటున్నారు.
సభకు అనుమతి ఉందని, హైకోర్టు అనుమతి ఇచ్చినా.. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజాపాలన అంటున్నారు.హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు వెళ్తాను. ఒకవేళ పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.












