National

ప‌క్కా వ్యూహం.. గెలుపే ల‌క్ష్యం డీలిమిటేష‌న్ బిల్లుపై బీజేపీ స్కెచ్

రచన: Kashi10 నిమిషాల పఠనం

ఈ 3 నెలల్లోనే ఏం మారింది..? ఏప్రిల్‌లో ఓడిపోయిన బిల్లు ఈసారి ఎలా గ‌ట్టెక్కుతుంది..? బీజేపీ వ్యూహమేంటి..? ఈ 3 నెల‌ల గ్యాప్‌లో సాధార‌ణ ఎన్నిక‌లేం జ‌ర‌గ‌లేదు. కేంద్రంలో ఎన్డీయే బ‌ల‌మేం పెర‌గలేదు. కానీ.. జాతీయ‌స్థాయిలో చోటు చేసుకున్న కొన్ని ప‌రిణామాలు బీజేపీకి క‌లిసొచ్చే అవ‌క‌శ‌ముంది. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికను ఎన్టీయే త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోబోతోంది.

డీలిమిటేష‌న్ బిల్లుపై ముందుకే...

ఎన్డీయే ప‌క్షాల‌తో క‌లిసి బీజేపీ స్కెచ్

పార్ల‌మెంటు ముందుకు డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులు

ఎన్డీయేకు క‌లిసొచ్చే అంశాలేంటి..?

2029లో జ‌మిలీ ఎన్నిక‌ల‌కు అవ‌కాశం

ఓడిన చోటే గెల‌వాల‌న్న‌ది బీజేపీ వ్యూహం. అధికార పార్టీకి మ‌రోసారి ప‌గ్గాలేయాల‌న్న‌ది కాంగ్రెస్ ప్ర‌తివ్యూహం. ఈ ఇద్ద‌రిలో ఈ సారి ఎవ‌రు గెల‌వ‌బోతున్నారు..? డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుల‌పై ఎవ‌రు పైచేయి సాధించ‌బోతున్నారు..? ఈ రెండు బిల్లుల‌ను మ‌రోసారి పార్ల‌మెంటు ముందుకు తెచ్చేందుకు మోదీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఎన్డీయే ప‌క్షాల‌తో క‌లిసి మంత్రాంగం న‌డిపిస్తోంది. మొన్న‌టి బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ రెండు బిల్లులు ఆమోదం పొంద‌లేదు. అధికార పార్టీకి సంఖ్యాబ‌లం చాల‌క‌పోవ‌డంతో వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ రెండు బిల్లుల‌ను గ‌ట్టెక్కించాల‌ని మోదీ స‌ర్కారు ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది..?

జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొద‌ల‌వుతున్నాయి. ఈ సమావేశాల్లో వ‌న్ నేష‌న్- వ‌న్ ఎల‌క్ష‌న్ ప్రతిపాదన కింద నియోజకవర్గాల పునర్విభజనకు చట్ట సవరణ బిల్లును ఎన్డీయే సర్కార్ మళ్లీ తెరపైకి తెస్తుందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అధికార కూటమి సంఖ్యా బలం సరిపోక ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. సాధారణ చట్టాల లాగా రాజ్యాంగ సవరణ బిల్లులను మామూలు మెజారిటీతో ఆమోదించడం సాధ్యంకాదు. వీటికి ప్రత్యేక మెజారిటీ అవసరం. అందుకే ప్ర‌తి ఎంపీ అవ‌స‌ర‌మే. ప్ర‌తి పార్టీని త‌న దారిలోకి తెచ్చుకోవాల్సిందే. ఎన్డీయే ప‌క్షాల‌తో ఇబ్బందేం లేదు కానీ.. త‌ట‌స్థంగా ఉన్న కొన్ని పార్టీలు, ఇండియా కూట‌మిలోని పార్టీలు బీజేపీతో క‌లిసి రావ‌డానికి స‌సేమిరా అంటున్నాయి. అందుకే బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రం చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.

రాజ్యాంగ స‌వ‌ర‌ణ అంత ఈజీ కాదు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చే బిల్లులన్నీ మామూలుగా సాధార‌ణ మెజారిటీతో చ‌ట్టంగా మారుతాయి. ఐతే రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌తో కూడుకున్న బిల్లులు గ‌ట్టెక్కాలంటే అంత ఈజీ కాదు. వీటి లెక్క‌లు వేరే ఉంటాయి. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులోని ఉభయ సభలలోనూ రెండు ప్ర‌ధాన అడ్డంకులను అధిగమించాలి. బిల్లు ఆమోదానికి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికిపైగా మద్దతు ఉండాలి. ఇది తొలి స‌వాల్. అలాగే ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతు ఇవ్వాలి. ఇదే బీజేపీని ఇబ్బంది పెడుతున్న అంశం. ఈ కార‌ణంగానే ఏప్రిల్ నెలలో బిల్లు ఆమోదింపచేయడంలో ఎన్డీయే సర్కార్‌ విఫలమైంది.

డీలిమిటేష‌న్‌తో పాటు మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అప్ప‌ట్లో అనుకూలంగా 298 ఓట్లు వ‌చ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చినా.. బిల్లు ఆమోదానికి మరో 54 ఓట్లు తక్కువయ్యాయి. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా మూడింట రెండు వంతుల మార్కు 352గా ఉంది. ఎన్డీయే ఆ మార్కును చేరుకోలేక‌పోయింది. దీంతో బిల్లును కేంద్రం ఉప‌సంహ‌రించుకుంది. 12 ఏళ్ల మోదీ పాల‌న‌లో దీనిని పెద్ద ఎదురుదెబ్బ‌గా బీజేపీ భావించింది. అందుకే ఈసారి ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.

ఎన్డీయేకు క‌లిసొచ్చే అంశాలేంటి..?

మ‌రి.. ఈ 3 నెలల్లోనే ఏం మారింది..? ఏప్రిల్‌లో ఓడిపోయిన బిల్లు ఈసారి ఎలా గ‌ట్టెక్కుతుంది..? బీజేపీ వ్యూహమేంటి..? ఈ 3 నెల‌ల గ్యాప్‌లో సాధార‌ణ ఎన్నిక‌లేం జ‌ర‌గ‌లేదు. కేంద్రంలో ఎన్డీయే బ‌ల‌మేం పెర‌గలేదు. కానీ.. జాతీయ‌స్థాయిలో చోటు చేసుకున్న కొన్ని ప‌రిణామాలు బీజేపీకి క‌లిసొచ్చే అవ‌క‌శ‌ముంది. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికను ఎన్టీయే త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోబోతోంది. టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు పార్టీ నుంచి విడిపోయారు. నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా NCPIలో విలీనమైనట్లు ప్ర‌క‌టించుకున్నారు. ఆ వెంట‌నే NDAకు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశాలకు ముందే స్పీకర్ అధికారికంగా ఈ విలీనాన్ని గుర్తించే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే లోక్‌సభలో అధికార కూటమి బలం పెరుగుతుంది.

ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఎన్డీయే పక్షమైన ఏకనాథ్ శిందే శివసేనలో చేరిపోయారు. ఈ ఎంపీలకు గుర్తింపు లభిస్తే ప్రతిపక్ష బెంచీల నుంచి అధికార కూటమి వైపు వ‌స్తారు. కాంగ్రెస్ టీవీకేకు మద్దతివ్వడంతో కాంగ్రెస్- డీఎంకే కూటమి విచ్ఛిన్నమైంది. పాత మిత్రుడికి స్టాలిన్ గుడ్‌బై చెప్పారు. ఐతే డీఎంకే అధికారికంగా NDAలో చేరనప్పటికీ ఇండి కూటమి నుంచి అది వెళ్లిపోవ‌డ‌మంటే ప్రతిపక్షాల బ‌లం త‌గ్గిపోయినట్టే.

ఈ నేప‌థ్యంలోనే కొన్ని కీల‌క‌ చట్టాలపై డీఎంకే నుంచి అంశాల వారీగా మద్దతు పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో పార్టీల బలాబలాల్లో వచ్చిన మార్పుల ద్వారా ఎగువ సభలో కూడా ఎన్డీయే పట్టును పెంచుకుంది. లోక్‌సభ సీట్లు 543 అయినప్పటికీ ఎంపీల మరణాల వల్ల 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి సభలో అసలు సంఖ్య తగ్గింది. దీనివల్ల మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడానికి అవసరమైన సంఖ్య కూడా తగ్గుతుంది.

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి దాదాపు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. తృణమూల్‌కు చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు, యూబీటీ శివసేనకి చెందిన ఆరుగురు ఎంపీలు తోడైతే ఆ బ‌లం 319కి చేరుతుంది. ఒకవేళ 22 మంది డీఎంకే ఎంపీలు మద్దతిస్తే అధికార కూట‌మి బలం దాదాపు 341కి పెరుగుతుంది. అయినప్పటికీ సభలో పూర్తి సంఖ్యలో ఎంపీలు హాజరైతే ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మార్కు అందుకోవ‌డం క‌ష్ట‌మే. ఇలాంటి స‌వాళ్ల మ‌ధ్య కూడా డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుల‌ను స‌భ‌ ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కీల‌క‌మ‌వుతుంది. వ్యూహాత్మకంగా ఎంపీల గైర్హాజరీ, ప్రతిపక్షాల హాజరు త‌గ్గేలా చూడ‌డం వంటి వ్యూహాల‌పై కూడా బీజేపీ ఫోక‌స్ చేయ‌వ‌చ్చు. ఏదేమైనా ఈసారి ఈ బిల్లుల‌ను స‌భ ముందుకు తెస్తే మాత్రం.. గెలిచి తీరాల‌నే వ్యూహంతో ఉంది ఎన్డీయే కూట‌మి.

#Delimitation Bill 2026#Women Reservation Bill#Parliament Monsoon Session#2026 NDA Strategy#BJP Delimitation Bill One Nation One Election
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి