The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ ఆఫర్ ఇచ్చి దక్కించుకున్నాడని నిన్నా.. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అది కేవలం పుకార్లేనని స్వయంగా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు.
నానీ హీరోగా దసరా లాంటి కల్ట్ మూవీ తీసి దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో ది ప్యారడైజ్ అనే పాన్ ఇండియన్ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. నాని సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు.
తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన 'ఆయా షేర్' సాంగ్ ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. నాని మేకోవర్..గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉంది. 'జడల్' అనే ఊర మాస్ అవతార్ లో నాని కనిపించబోతుండటం అందరికీ పెద్ద సర్‌ప్రైజ్. ఇలాంటి, స్పెషాలిటీస్ ఎన్నో ది ప్యారడైజ్ సినిమాలో ఉండబోతున్నాయి.
అందుకే, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎవరు దక్కించుకుంటారో..! అని క్యూరియాసిటీ ఉండేది. తాజా సమాచారం మేరకు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్యారడైజ్ సినిమా నైజాం హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నారట. త్వరలో, అధికారికంగా ప్రకటించనున్నట్టుగా సమాచారం.
ఇక, దిల్ రాజుకి నైజాం హక్కులు దక్కినట్టు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.












