తెలంగాణ రాష్ట్రంలో మరో లగచర్ల ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను రంగంలోకి దించడంతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌గూడలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా (HYDRAA), రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజాము నుంచే భారీ పోలీస్ ఆపరేషన్ ప్రారంభమైంది. దాదాపు 30 పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన 1,200 మందికి పైగా పోలీసులతో బహదూర్‌గూడ గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామ సరిహద్దులను దిగ్బంధించి వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తమ పట్టా భూముల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను, గ్రామస్తులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. భూములను వదులుకునే ప్రసంగే లేదంటూ ఆందోళనకు దిగిన మహిళలను, రైతులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో తరలించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులను వాడుకుంటూ బలవంతంగా భూములను లాక్కుంటోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వం బలప్రయోగంతో భూములను స్వాధీనం చేసుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత రైతులకు, గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు బహదూర్‌గూడ గ్రామానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ అరెస్ట్‌ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రైతులకు మద్దతుగా నిలిచే నాయకులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ భూసేకరణ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భూదాహాన్ని తీర్చుకోవడానికి వందలాది మంది పోలీసులను వాడుకుంటూ సామాన్య రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ప్రతిపక్షాలు మరియు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పచ్చని పొలాలను, పట్టా భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.












