నగర అభివృద్ధికి అక్రమ నిర్మాణాలు అడ్డు గోడలుగా మారుతున్నాయి. అలాగే నిబంధనలు పక్కనపెట్టి నిర్మిస్తున్న ఈ కట్టడాలు ప్రజల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా మళ్లీ అదే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల పై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది.
హైదరాబాద్ లో నిర్మితం అవుతున్న అక్రమ నిర్మాణాలకు భారీ ఫైన్లు విధించాల్సిందేనని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అనధికార కట్టడాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.. అక్రమ నిర్మాణాలు చేస్తే.. తర్వాత ఏదో ఒక విధంగా వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చనే ధోరణికి స్వస్తి పలకాలని సూచించింది. కాగా హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్‌కు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఇప్పుడు సాధారణ వ్యవహారంగా మారుతున్నాయని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా.. రెగ్యులరైజేషన్ పేరుతో అక్రమ నిర్మాణాలకు తర్వాత అనుమతులు ఇచ్చే విధానం కొనసాగితే, అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించింది.
ఎవరో ఒకరు నిబంధనలకు విరుద్ధంగా భవనం కడతారు. రేపు దాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుందనే నమ్మకం ఏర్పడితే.. ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు, చట్టాలు అన్నీ పక్కన పెట్టే పరిస్థితి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. రెగ్యులరైజేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో కోర్టుల నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని నిర్మాణాలు కొనసాగిస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలాంటి దరఖాస్తులు రెండు లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని తెలిపింది. అయితే చిన్న స్థలాల్లో నిబంధనలకు లోబడి నిర్మించిన నిర్మాణాలకు వర్తించే క్రమబద్ధీకరణ విధానాన్ని.. అంతస్తుల మీద అంతస్తులు నిర్మించిన భారీ అక్రమ భవనాలకు వర్తింపజేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలను రాజకీయ పలుకుబడితో అడ్డుకోకపోవడం.. ఆ తర్వాత వాటిని క్రమబద్ధీకరించడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కోర్టు అభిప్రాయపడింది.
చట్టాన్ని గౌరవించి, అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకునే ప్రజలకు ఇది అన్యాయమని పేర్కొంది. ఈ కేసులో భారీ అక్రమ నిర్మాణం చేపట్టినందుకు జరిమానా విధించిన కోర్టు.. రెండు లక్షల రూపాయలను పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, మరో లక్ష రూపాయలను హైకోర్టు న్యాయవాదుల సంక్షేమ సంఘానికి చెల్లించాలని ఆదేశించింది.
మరోవైపు అక్రమంగా కట్టడం కట్టి, తర్వాత ఏదో ఒక మార్గంలో దాన్ని చట్టబద్ధం చేసుకోవచ్చనే ఆలోచన ఇకపై పనిచేయకపోవచ్చు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టేవారు.. చివరికి భారీ మూల్యం చెల్లించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తాజా వ్యాఖ్యలు స్పష్టమైన హెచ్చరికగా నిలిచాయి..












