రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చాలా నెమ్మదిగా సాగుతోంది. ఆగస్టు 3తో ఎస్ఐఆర్‌కు గడువు ముగియనుంది. ఈనెల 24తోనే గడువు ముగియాల్సి ఉంది.కానీ, రాజకీయపార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం వచ్చేనెల 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈసీ మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో చాలా వేగంగా జరుగుతోందని, 98 శాతం పూర్తయిందని చెబుతోంది. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
చాలా జిల్లాల్లో ఎస్ఐఆర్ ఫామ్స్ ఇంకా తమకు అందలేదని ఓటర్లు అంటున్నారు. బీఎల్‌వోలు సైతం అదే చెబుతున్నారు. మరికొన్ని చోట్ల బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లకుండానే ఏరియాలోని ఓ ప్రధాన ప్రాంగణం లేదా చౌరస్తాలో నిలబడి కాల్స్ చేసి ఓటర్లను పిలుస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికలం సంఘం చెబుతున్నా ఇంతవరకు చర్యలు శూన్యంగానే ఉన్నట్టు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
ఇక రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ఐ చాలా నెమ్మదిగా సాగుతోంది. పల్లె ప్రాంతాల్లో కాస్త స్పీడ్ అయినా పట్టణ ప్రాంతాల్లో మాత్రం నెమ్మదిగా కొనసాగుతోంది. చిరునామాలు మారడం, పట్టణాల్లో ఓటు హక్కు ఉన్నవారికి గ్రామాల్లోనూ ఉండటం వంటి కారణాలతో ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్టు సమాచారం. కొందరి ఓటర్ల వివరాల ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. ఓటర్ కార్డులు ఉండి.. గత ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి పేర్లు సైతం ఎస్ఐఆర్ జాబితాలో చూపించడం లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది.
డబుల్ ఓట్లు ఉన్నవారు పట్టణాల్లో ఓటును వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వారు స్వగ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్నట్టు తెలిసింది.దీంతో వారు బీఎల్ వోలకు పత్రాలు ఇవ్వడం లేదు.చనిపోయిన వారి ఓట్లను బూత్ లెవెల్ అధికారులు తొలగిస్తున్నారు.ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నా గుర్తించి డిలీట్ చేస్తున్నారు. వేల సంఖ్యలో బోగస్ ఓట్లు తేలగా వాటిని తొలగిస్తున్నారు.జిల్లాలో మొత్తంగా 2 లక్షలకు పైగా ఓట్లు ఏరివేతకు గురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో మొత్తం ఓట్లు 36,99,743 కాగా, డిజిటలైజేషన్ పూర్తయినవి 21,82,638, బీఎల్ వోలకు ఇంకా అందని ఫారాలు 2,48,350,ఇప్పటివరకు గుర్తించిన డెత్ ఓట్లు 4,181, గుర్తించిన వలస, డూప్లికేట్ ఓట్లు 20,934గా ఉన్నాయి. అయితే, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంది. ఓట్లు భారీగా పోతే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం తప్పదని తెలుస్తోంది.












