తెలంగాణ

ప్రైవేట్ సంస్థలపై హెచ్‌ఆర్‌సీకి విచారణాధికారం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

ప్రైవేట్ కంపెనీలు, వాటి సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)కి లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రైవేట్ కంపెనీలు, వాటి సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)కి లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్‌ఆర్‌సీ అధికారాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన అంశాలకే పరిమితమవుతాయని తెలిపింది.

వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు పనిప్రదేశంలో వేధింపులపై హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించగా, కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సదరు సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉద్యోగ వివాదాలు, పనితీరు మదింపు వంటివి యజమాని-ఉద్యోగి మధ్య ఉండే అంతర్గత అంశాలని, ఆరోపణల తీవ్రతను బట్టి హెచ్‌ఆర్‌సీ తన పరిధిని విస్తరించుకోలేదని వ్యాఖ్యానించింది.

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు 'పోష్ చట్టం (POSH Act)' కింద ఏర్పాటైన అంతర్గత కమిటీలే సరైన వేదికలని కోర్టు సూచించింది. హెచ్‌ఆర్‌సీ వద్ద ఉన్న ఫిర్యాదులను కొట్టివేస్తూ కంపెనీ పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం, బాధితులు ఇతర చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయం పొందవచ్చని స్పష్టం చేసింది.

 

##TelanganaHighCourt##HRC##POSHAct##WellsFargo##PrivateSectorNews##TeluguNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి