క్రైమ్

Fire Accident: ప్రముఖ పుణ్యక్షేత్రంలో అగ్నిప్రమాదం.. రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం..

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం..

స్థానికుల కథనం ప్రకారం.. గుట్టకింద ఉన్న ఓ బొమ్మల దుకాణంలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా కనిపించిన మంటలు.. క్రమంగా పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు భారీగా ఎగసిపడి మొత్తం 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లను చుట్టుముట్టాయి. దీంతో దుకాణాల్లోని సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ప్రమాద సమయంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలు సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికీ వ్యాపించాయి. ఈ ఘటనలో కార్యాలయంలోని పలు ముఖ్యమైన దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామపంచాయతీ సర్పంచ్ తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో దుకాణాల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. లేకపోతే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా వ్యాపారులు భారీగా నష్టపోవడంతో.. తమకు ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో భారీగా మంటలు చెలరేగడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. గుట్టకింద ఉన్న దుకాణాలు, తోపుడు బండ్లు, గ్యాస్ సిలిండర్ల వినియోగంపై భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

#Fire Accident#Cheruvugattu#Sri Parvathi#Jadala Ramalingeswara Swamy#Narketpally#Nalgonda
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి