జుట్టు రాలిపోతోందా? తలలో తీవ్రమైన దురద, తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? అయితే కారణం చుండ్రు కావచ్చు. కానీ చుండ్రు అంటే కేవలం పొడి చర్మం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో స్కాల్ప్‌పై ఉండే మలాసెజియా అనే ఈస్ట్, అధిక ఆయిలీనెస్, చర్మ సమస్యలు లేదా కొన్ని హెయిర్ కేర్ అలవాట్లు కూడా చుండ్రుకు కారణం కావచ్చు.
మరి చుండ్రుకు ఉల్లి రసం నిజంగా పనిచేస్తుందా? అనేది తెలుసుకుంటే.. ఉల్లిపాయలో సల్ఫర్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉండటం వల్ల, ఉల్లి రసం జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చాలామంది నమ్ముతారు. అయితే చుండ్రును తగ్గించడానికి ఉల్లి రసం పనిచేస్తుందని నిర్ధారించే బలమైన, విస్తృతమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. ఉల్లి రసంపై జరిగిన ఒక చిన్న అధ్యయనం ప్రధానంగా ప్యాచీ హెయిర్ లాస్ అయిన అలోపేషియా ఏరియాటా గురించి మాత్రమే జరిగింది.
దాన్ని సాధారణ చుండ్రు చికిత్సకు నేరుగా వర్తింపజేయలేం. అందువల్ల ఉల్లి రసాన్ని చుండ్రుకు ఖచ్చితమైన చికిత్సగా చెప్పలేమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయినా ఎవరైనా ఉల్లి రసాన్ని ఇంటి చిట్కాగా ప్రయత్నించాలనుకుంటే.. ముందుగా కొద్దిగా చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయాలి. మంట, ఎర్రదనం, దురద లేదా అలర్జీ కనిపిస్తే వెంటనే ఆపేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా సున్నితమైన లేదా ఇప్పటికే ఇరిటేషన్ ఉన్న స్కాల్ప్‌పై ఉల్లి రసం మరింత మంటను కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు చుండ్రు తగ్గించడానికి సాధారణంగా వైద్య నిపుణులు సూచించేది.. యాంటీ-డాండ్రఫ్ షాంపూలు. వీటిలో కీటోకోనజోల్, జింక్ పైరిథియోన్, సెలీనియం సల్ఫైడ్, సాలిసిలిక్ యాసిడ్ లేదా సల్ఫర్ వంటి పదార్థాలు ఉండవచ్చు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా పనిచేస్తాయి. ఒక షాంపూ పనిచేయకపోతే, వైద్యుల సలహాతో వేరే యాక్టివ్ ఇంగ్రిడియెంట్ ఉన్న షాంపూను ప్రయత్నించవచ్చు.
అయితే షాంపూను తలకు రాసి వెంటనే కడిగేయడం వల్ల ఫలితం ఉండక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డెర్మటాలజిస్ట్ సూచించిన సమయం వరకు స్కాల్ప్‌పై ఉంచడం అవసరం. మరో ముఖ్యమైన విషయం.. చుండ్రు ఉన్న ప్రతి ఒక్కరికీ జుట్టు రాలిపోవడం ఒకే కారణంతో జరగదు. చుండ్రు వల్ల వచ్చే దురదతో పదేపదే తల గోకడం వల్ల జుట్టు విరిగిపోవచ్చు లేదా తాత్కాలికంగా ఎక్కువగా రాలుతున్నట్లు కనిపించవచ్చు.
కానీ తీవ్రమైన జుట్టు రాలడానికి హార్మోన్ల సమస్యలు, పోషక లోపాలు, జన్యుపరమైన కారణాలు, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర స్కాల్ప్ వ్యాధులు కూడా కారణం కావచ్చు. కాబట్టి చుండ్రు చాలా తీవ్రంగా ఉండటం, స్కాల్ప్ ఎర్రబడటం లేదా వాపు రావడం, తీవ్రమైన దురద, గాయాలు, ముఖం లేదా శరీరంలోని ఇతర భాగాల్లో కూడా పొలుసులు కనిపించడం, లేదా యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడినా కొన్ని వారాల్లో మెరుగుదల లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే.. డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
చివరగా.. సహజమైన ఇంటి చిట్కాలు అందరికీ ఒకే విధంగా పనిచేయవు. ఉల్లి రసం కొంతమందికి ఉపయోగకరంగా అనిపించినా.. చుండ్రుకు ఇది నిరూపితమైన ప్రధాన చికిత్స కాదు. కాబట్టి లక్షణాలు తీవ్రంగా ఉంటే.. శాస్త్రీయ ఆధారాలున్న చికిత్సను ఎంచుకోవడమే సురక్షితమైన మార్గమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.. ఇక జుట్టుకు పెట్టుకోవడానికి ఉల్లి రసం ఎలా తయారు చేయాలంటే?..
ఒక ఉల్లిపాయను తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేసి, దాని రసాన్ని వడకట్టండి. దూది (Cotton ball) సహాయంతో ఆ రసాన్ని నేరుగా తల మాడకి (Scalp) మాత్రమే రాయండి. ఉల్లి రసంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ కలిపితే మాడు పొడిబారకుండా ఉంటుందని చెబుతున్నారు. అలాగే 15 నుండి 20 నిమిషాల పాటు ఈ రసాన్ని తలపై ఉంచి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలని.. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..












