Gold Demand: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న బంధం కేవలం ఒక లోహంతో ముడిపడినది కాదు.. అది సంప్రదాయం, సెంటిమెంట్, ఆపత్కాలపు ఆస్తి. పెళ్లిళ్లు, పండుగలు, చిన్న చిన్న శుభకార్యాలొచ్చినా మెడలో నాలుగు గ్రాముల పసిడి మెరిసిపోవాల్సిందేనని ఆశపడే అతివలు మన దేశంలో కోట్లలో ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ బంగారు దుకాణాల వైపు చూడాలంటేనే జనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే నగల షాపుల్లో సందడి తగ్గడం చూస్తుంటే.. అసలు భారతీయుల్లో బంగారంపై ఉన్న మోజు తగ్గిపోయిందా? లేక భగ్గుమంటున్న ధరలు సామాన్యుడిని ఆమడదూరంలో నిలబెట్టాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.
అంకెలు చెబుతున్న చేదు నిజం ఇదే
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో పసిడి డిమాండ్ ఊహించని రీతిలో పడిపోయి ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి గిరాకీ ఏకంగా 29 శాతం క్షీణించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 229.8 టన్నుల బంగారం కొనుగోళ్లు జరగ్గా.. ఇప్పుడది 162.5 టన్నులకే పరిమితమైంది.
ముఖ్యంగా భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాల కొనుగోళ్లు 125 టన్నుల నుంచి 20 శాతం క్షీణించి 99.9 టన్నులకు పడిపోయాయి. ఇక భవిష్యత్ అవసరాల కోసం, పెట్టుబడిగా భావించి కొనే గోల్డ్ కాయిన్లు, బిస్కెట్ల డిమాండ్ అయితే అంతకుమించి ఏకంగా 40 శాతం మేర కుదేలైంది. గతంలో 91.6 టన్నులుగా ఉన్న పెట్టుబడుల గిరాకీ ఇప్పుడు 55 టన్నులకు చేరిందంటే మార్కెట్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మోజు తగ్గలేదు.. కానీ
వాస్తవానికి ప్రజల్లో బంగారంపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ, గడిచిన ఏడాది కాలంలో ధరల్లో వచ్చిన విపరీతమైన మార్పే ఈ పతనానికి ప్రధాన కారణం. ఏడాది వ్యవధిలోనే పసిడి ధరలు సుమారు 45 శాతం వరకు పెరిగాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు 3,457 డాలర్ల నుంచి 4,262 డాలర్లకు ఎగబాకడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం, కేంద్రం పెంచిన దిగుమతి సుంకాలు, అదనంగా చేరే జీఎస్టీ.. ఇవన్నీ కలిసి ధరను ఆకాశానికి చేర్చాయి.
ధరలు భారీగా పెరిగిపోవడంతో దేశంలోకి అక్రమ మార్గాల్లో పసిడిని తెచ్చే స్మగ్లింగ్ ఏకంగా 1,500 శాతం పెరగడం మరో సంచలన పరిణామం. మరోపక్క పెరిగిన నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం వల్ల మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు ఉన్నా సరే.. పాత బంగారాన్ని మార్చుకోవడం లేదా కొనుగోలు చేసే పరిమాణాన్ని భారీగా తగ్గించుకోవడానికే జనం మొగ్గు చూపుతున్నారు.
రికవరీ సాధ్యమేనా?
ఈ ఏడాది మొత్తానికి దేశీయంగా బంగారం డిమాండ్ 625 నుంచి 675 టన్నుల మధ్యనే నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 2020 తర్వాత అత్యల్ప స్థాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా ఆశించిన స్థాయిలో దుకాణాలు కళకళలాడటం కష్టమేనని వ్యాపార వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అయితే, "ధరలు మరింత తగ్గుతాయేమో వేచి చూద్దాం" అనే ధోరణి కంటే.. దీర్ఘకాలిక అవసరాలు ఉన్నవారు కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మేలని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, భారతీయులకు ఎంతో ఇష్టమైన పసిడి.. ప్రస్తుతానికైతే సామాన్యుడి అందుబాటులో లేని 'లగ్జరీ'గా మారిపోయిందన్నది కాదనలేని నిజం.


