Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేగింది. అయ్యప్ప గుట్ట శివారులోని వ్యవసాయ బావిలో ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు మెడిసిన్స్ తీసుకొచ్చి అక్కడ పారబోస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సిన లక్షలాది రూపాయల విలువైన మెడిసిన్స్ ను ఇలా పారబోసి తగలబెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మందులు పారబోసి తగలబెట్టిన దుండగులు
ఆ మెడిసిన్స్ పై ప్రభుత్వ ముద్రలు ఉన్నాయి. అందులో గడువు తీరిన మందులు కూడా ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చి వ్యవసాయ బావిలో వాటిని పారవేసినట్లుగా తెలుస్తోంది. మందులతో పాటు సూదులు, గ్లౌజులు వంటి బయో వ్యర్ధాలు కూడా ఉండటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మందులను అక్కడ పారబోసి తగులబెట్టడంతో విషపూరిత పొగ వెలువడుతోందని, చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున వాయు కాలుష్యం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణానికి పెను ముప్పు
బావిలో పడేసిన మెడిసిన్స్.. సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి లేదా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మందులా? లేక ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, మందులను ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం వల్ల, వాటిని తగలబెట్టడం వల్ల పర్యవరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
గడువు తీరిన మందులను ప్రత్యేక పద్ధతుల్లో ఎంతో జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ, ఇలా నిర్లక్ష్యంగా వ్యవసాయ బావిలో పడేయటం ప్రమాదకరం అంటున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోనని కంగారుపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని.. దీనిపై విచారణ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


