Global Summit: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సూచించారు.
ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ ఆఫీసర్
సదస్సుకు వచ్చే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. ఎయిర్ పోర్టులోనే ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పాస్ ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశానికి ముందే పూర్తి సమాచారాన్ని ప్రతినిధులకు అందజేయాలన్నారు. ఈ సదస్సులో టూరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా సమ్మిట్ లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన
ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారి, సెక్యూరిటీ అధికారిని నియమించాలని ఆదేశించారు. వాతావరణ మార్పులపై సమ్మిట్ లో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీ నుండి ఆక్స్ ఫర్డ్ వరకు తెలంగాణ విద్యా రంగంపైనా చర్చ జరగాలన్నారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ చెప్పారు. సమ్మిట్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. నవంబర్ 15 కల్లా ఏర్పాట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


