తెలంగాణ

BC Lands: బీసీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోదు-మంత్రి పొన్నం

5 నిమిషాల పఠనం

బీసీలకు కేటాయించిన భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలకు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

BC Lands: బీసీలకు కేటాయించిన భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలకు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీసీలకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

బీసీలకు కేటాయించిన భూముల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు కేటాయించిన భూముల్లో భవనాలు నిర్మించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావునివ్వకుండా ఐక్యంగా ఉండి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

బీసీ కుల సంఘాలకు నిధుల మంజూరు పత్రాలు అందజేత

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవో పత్రాలను కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

''తెలంగాణ రాష్ట్రంలో గతంలో 38 కుల సంఘాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు కేటాయించిన 88.50 కోట్ల రూపాయలను సంబంధిత కుల సంఘాలకు జీవోల రూపంలో అందించాము. హెచ్ఎండీఏ సహకారంతో భవన నిర్మాణం చేసుకునే విధంగా సహకరిస్తాం. కార్తీక మాసంలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవాలని సూచిస్తున్నాం.

బీసీల భూములను ముట్టుకునే ధైర్యం ఏ ప్రభుత్వమూ చేయదు

కాల పరిమితి లోపల నిర్మాణాలు పూర్తి చేయాలనేది ప్రభుత్వం దృఢ సంకల్పం. మాటలకే పరిమితం కాకుండా, కేటాయింపులకే పరిమితం కాకుండా, ఇంజనీరింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ హెచ్ఎండీఏ సహకారంతో సింగిల్ విండో పర్మిషన్ల ద్వారా భవన నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తాం. ఈరోజు ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించిన, కేటాయించిన భూములను ముట్టుకునే ధైర్యం చేయదు. దుష్ప్రచారం చేయడం ద్వారా ఏదో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ నే సాధ్యం

మేము వాళ్లలా భూములు కేటాయించి వదిలి చేతులు దులుపుకోవడం లేదు. కాల పరిమితిలో నిర్మాణాలు పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. బలహీన వర్గాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం'' అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

#BC Lands#Minister Ponnam Prabhakar#Telangana#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి