గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అందులో పొలిటికల్ పార్టీలకు చెందిన వారు కొందరు ఉంటే, మరికొందరు వీఐపీలకు బినామీలుగా కొనసాగుతున్నారు.వారి నేమ్ కార్డు, పర్సనల్ డిటేల్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల పేరిట అక్రమాలకు తెగబడుతున్నారు. ఇదిలాఉంటే, తాజాగా ఓ ఇన్ ఫ్రా కంపెనీ రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకటి కాదు రెండు కాదు రూ. 680 కోట్ల విలువైన 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని సాస్ (SAS) ఇన్‌ఫ్రా కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత ప్రధాన సన్నిహితుడి అండతో ఈ భూమిని తమ పేరుపై రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.ఏకంగా చెరువులో నుంచి రోడ్డు వేసుకునేందుకు వీలుగా ఇరుగుపొరుగు అపార్ట్‌మెంట్‌వాసులు అడ్డుచెప్పకుండా నేరుగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వారికి ధమ్కీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారానికి ముందు ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లో 10.32 ఎకరాల భూమిలో కొంతభాగాన్ని కొనుగోలు చేసిన సాస్ (SAS) ఇన్‌ఫ్రా.. మరికొంత భాగాన్ని ఆ ల్యాండ్ యజమానులతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిసింది. 2017లో ప్రాజెక్టు మొదలుపెట్టిన ఈ కంపెనీ.. తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం లీజుకు కావాలని.. 1.17 ఎకరాల భూమిని 6 నెలల పాటు రూ.68.97 లక్షలకు లీజుకు తీసుకున్నట్టు తెలిసింది.
ఆ తర్వాత పక్కనే ఉన్న మరో 2 ఎకరాలను కూడా కలిపేసుకుని 3.17 ఎకరాల భూమిలో వాహనాలు పార్కింగ్ చేసేవారు. ఈ విషయాన్ని గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.94 కోట్లు జరిమానా వేయడంతో పాటు కంపెనీని గెంటేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాస్ ఇన్‌ఫ్రా తన అసలు రూపాన్ని బయటపెట్టినట్టు విమర్శలొస్తున్నాయి. ఓ ముఖ్యనేత సహచరుడి అండతో రాత్రికి రాత్రి సర్వే నంబర్ 20/1లోని 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు ఈ ఏడాది జూన్ 19న విజయవంతంగా ఆ భూమిని సాస్ యజమానుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు సమాచారం. అందుకు రెవెన్యూ శాఖ సైతం సహకారం అందించినట్టు తెలుస్తోంది.
22ఏ నిషేధిత జాబితాలో సర్కారీ-రాష్ట్ర ప్రభుత్వ భూమిగా నమోదైన భూమిని సాస్ ఇన్ ఫ్రా పేరిట రిజిస్ట్రేషన్ కాంగ్రెస్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, తమ అపార్ట్‌మెంట్ కోసం తౌతోనికుంట చెరువు మధ్యలో 30-40 ఫీట్ల రోడ్డును సాస్ ఐటవర్-గ్రీన్‌గ్రేస్ వేయగా.. అందుకు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు అడ్డుచెప్పినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే సాస్ ఇన్ ఫ్రాకు మద్దతుగా రంగంలోకి దిగిన హైడ్రా.. అపార్ట్‌మెంట్లకు వెళ్లేందుకు ఉన్న ప్రధాన దారి మూసేస్తామని, మీరు కూడా సాస్ కంపెనీ చెరువు మధ్యలో వేసిన రోడ్డును వాడుకోవాలని ధమ్కీ ఇచ్చినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే సాస్ ఇన్ ఫ్రా భూ కబ్జా, చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేస్తున్న విషయానికి సంబంధించిన అన్ని ఆధారాలతో సహా అపార్ట్‌మెంట్ వాసులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపి స్టేటస్ కో ఇచ్చినట్టు తెలిసింది.


