Telangana Politics: ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహించిన 'ఇండియా' కూటమి ర్యాలీ కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా ఢిల్లీకి వెళ్లారు. అంతా సజావుగానే సాగిందనుకుంటున్న సమయంలో.. ఓ విలాసవంతమైన స్టార్ హోటల్ లాబీ వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా గాంధీ భవన్ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ఆ క్షణంలో ఏం జరిగింది?
ర్యాలీ ముగిసిన అనంతరం తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హోటల్ లాబీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ గుంపులో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అదే టైంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాబీ మీదుగా నడుచుకుంటూ అటువైపు వచ్చారు.
ఆయన్ను చూడగానే కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా ముందుకొచ్చారు. చేతులు జోడించి "నమస్తే మంత్రిగారూ.. బాగున్నారా?" అంటూ నవ్వుతూ పలకరించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎదుటివారి నుంచి వచ్చేది ఒక నవ్వు లేదా క్షేమ సమాచారం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది.
ఆ పలకరింపు వినగానే దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలోనే లక్ష్మీకాంతారావుపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. "నా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చడానికి నువ్వెవరు? నీ హద్దుల్లో నువ్వుండు.." అంటూ నిప్పులు చెరిగినట్లు సమాచారం. అనుకోని ఈ పరిణామంతో అక్కడున్న మిగతా ఎమ్మెల్యేలు నిర్ఘాంతపోగా.. నలుగురి ముందూ జరిగిన అవమానంతో లక్ష్మీకాంతారావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రగిలిన పాత పగ.. అసలు కారణమిదే!
హోటల్ లాబీలో బయటపడిన ఆవేశం వెనుక సంగారెడ్డి జిల్లా రాజకీయ ఆధిపత్య పోరు దాగుందట. లక్ష్మీకాంతారావు జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆయన స్వస్థలం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. దీంతో సొంత జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే క్రమంలో సంగారెడ్డి డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవిపై ఆయన కన్నేశారు.
వాస్తవానికి సంగారెడ్డి డీసీసీ పీఠం తన వీరవిధేయుడు ఉజ్వల్ రెడ్డికి దక్కాలని మంత్రి దామోదర మొదటినుంచీ పట్టుబట్టారు. అయితే, లక్ష్మీకాంతారావు ఢిల్లీ పెద్దల వద్ద చక్రం తిప్పి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడైన శేఖర్‌రెడ్డికి ఆ కుర్చీ దక్కేలా పావులు కదిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న తన మాటకు విలువ లేకుండా, పక్క జిల్లా ఎమ్మెల్యే తన ఇలాకాలోనే ఆధిపత్యం చలాయించడాన్ని దామోదర ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అప్పటినుంచి సరైన సమయం కోసం వేచిచూస్తున్న మంత్రి.. ఢిల్లీ లాబీలో ఎమ్మెల్యే పలకరించేసరికి ఆ కోపాన్నంతా ఒక్కసారిగా బయటపెట్టారట.
అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకు ఎమ్మెల్యే సిద్ధం!
మంత్రి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయదల్చుకోలేదని తెలుస్తోంది. కేవలం మర్యాదగా పలకరించినందుకు తనపై అంతలా నోరుపారేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే.. పార్టీ క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసీసీ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రజాప్రతినిధిని బహిరంగంగా అవమానించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీ వేదికగా మొదలైన ఈ 'లాబీ వార్' రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.


