పాకిస్థాన్ బలగాలే లక్ష్యంగా బలూచిస్థాన్ విముక్తి సైన్యం (Baloch Liberation Army - BLA) ఒక్కసారిగా విరుచుకుపడింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరిపిన 25 వేర్వేరు నిరోధక దాడుల్లో కనీసం 40 మంది పాకిస్థానీ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు బిఎల్ఎ ప్రతినిధి జీయంద్ బలూచ్ గురువారం (నవంబర్ 5, 2026) ప్రకటించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 మధ్య కాలంలో పాక్ మిలిటరీ స్థావరాలు, ఇంటెలిజెన్స్ వాహనాలు, సైనిక కాన్వాయ్‌లపై వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.
బిఎల్ఎ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నవంబర్ 3న ఖారన్ (Kharan) జిల్లాలో సైనిక వాహనాలపై జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా, రొటింకోలోని సైనిక క్యాంపుపై భారీ ఆయుధాలతో దాడి చేశారు. అలాగే అక్టోబర్ 26న ఖుజ్దార్‌లోని కర్క్ ప్రాంతంలో దాదాపు 30 సైనిక, పోలీసు, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) వాహనాల కాన్వాయ్‌పై జరిపిన దాడిలో ఏకంగా 9 మందికి పైగా సైనికులు మరణించారు. మస్తుంగ్, వాషుక్, పంజ్‌గుర్ ప్రాంతాల్లోనూ కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్లు, రాకెట్లతో దాడులు జరిపినట్లు వెల్లడించారు.
సైనిక బలగాల ప్రాణనష్టంతో పాటు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన సరుకు రవాణా, సైనిక సరఫరా మార్గాలను కూడా బిఎల్ఎ దెబ్బతీసింది. నుష్కి, దాల్బందిన్ రహదారుల్లో సైనిక రేషన్, సామగ్రితో వెళ్తున్న ట్రక్కులను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ‘ఆర్థిక దిగ్బంధం’లో భాగంగా క్వెట్టా-తఫ్తాన్ హైవేపై పలు వాణిజ్య వాహనాలను అడ్డుకుని తగలేసినట్లు ప్రకటించారు. భద్రతా బలగాలకు సహకరిస్తున్న స్థానిక గుండాల ముఠాలపై కూడా ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు పూర్తి చేసినట్లు వివరించారు.
బలూచిస్థాన్‌లో నిరంతరం పెరుగుతున్న ఈ గెరిల్లా దాడులతో పాకిస్థాన్ భద్రతా బలగాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. ఒకేసారి 25 ప్రాంతాల్లో దాడులు జరిపి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించడం ద్వారా బిఎల్ఎ తన సైనిక సత్తాను ప్రదర్శించగా, ఈ ఘటనలపై పాకిస్థాన్ ప్రభుత్వం, మిలిటరీ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతూ ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించాయి.


