కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నా వారి తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే మాకేంది? అన్న ధోరణిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రం నుంచి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మధ్య మాటల యుద్ధం నెలకొంది.
డీసీసీ పదవుల నియామకంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు సమాచారం.ఈ క్రమంలోనే మంత్రి దామోదర ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ లాబీలోని గదిలో తీవ్ర అసభ్య పదజాలంతో లక్ష్మీకాంతరావును దూషించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో వ్యక్తిగతంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినట్టు సమాచారం. ఆ సమయంలో మల్‌రెడ్డి రంగారెడ్డి,పలువురు నేతలు ఉన్నట్టు తెలిసింది.
మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి, అవమానపరిచాడని పీసీసీకి లక్ష్మీకాంతరావు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అనంతరం పీసీసీకి కూడా ఫిర్యాదు చేయడంతో మంత్రి దామోదర రాజనరసింహకు నిన్న సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నోటీసులు పంపారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు.
అయితే, ఇవాళ ఉదయం వివరణ ఇచ్చేందుకు మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్ వెళ్లలేదని తెలిసింది. నేడు విచారణ ఉంటుందని, వివరణ ఇవ్వాలని ముందే నోటీసులు ఇచ్చినా మంత్రి పెద్దగా పట్టించుకోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు కూడా గాంధీభవన్‌కు రావాలని, వివరణ ఇవాలని పీసీసీ చీఫ్ నోటీసులు పంపారు. ముందుగా మంత్రి దామోదర విచారణ పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే కాంతారావు విచారించనున్నారు. కానీ, మంత్రి రాకపోవడంతో పీసీసీ క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకుంటుందా? లేదా మరోసారి అవకాశం ఇస్తుందా? లేదా అని వేచిచూడాల్సిందే.


