తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనిపై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంశంలో బడా భాయ్ మోడీ, ఏబీవీపీ చోటా భాయ్ రేవంత్ రెడ్డిపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌లో ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వాస్తవమేనని చెబుతారని, చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అందరికీ తెలిసిన ఈ విషయంపై నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నది నిజం కాదా? అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి , అగ్రనేత రాహుల్ గాంధీ వందల కోట్లు దోచుకుంటున్నారని పదే పదే ఆరోపించే మోడీ, అమిత్ షాలు ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ హైదరాబాద్‌కు వస్తుంటారని, ఆ సమయంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ సర్కార్ కోట్లు దోచుకుంటోందని ఆరోపిస్తుంటారని గుర్తుచేశారు.మరి ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని నిలదీశారు.
రేవంత్ సర్కార్ మీద కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల నడుమ అంతర్గతంగా అవగాహన ఉందని, అందుకే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు. నగరంలోని బిల్డర్లు, డెవలపర్లకు ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల గురించి తెలిసినప్పుడు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియకుండా ఉంటుందా? అని అడిగారు. మోడీ, అమిత్ షాలు కేవలం ఆరోపణలు చేయడం వరకేనని చర్యలు తీసుకోరని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు కేవలం మాటలకే పరిమితమని, చేతల్లో మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


