Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, తెలుగు చిత్ర పరిశ్రమ, దక్షిణాది సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలపై స్పందించి గట్టిగానే సమాధామిచ్చారు. ఈ క్రమంలోనే, తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా రంగంలోకి దిగారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తాను తెలుగు నటిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాసుకొచ్చారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
రాధికా ఆప్టే ఇటీవల కీర్తి సురేష్‌తో కలిసి నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. మాట్లాడొచ్చు కానీ, కెరీర్ ప్రారంభంలో తాను నటించిన తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, తన పాత్ర చనిపోయిన తర్వాత కూడా హీరోతో ముడిపడిన యాక్షన్ సన్నివేశాల్లో తన శరీరాన్ని హీరో (బాలకృష్ణ) భుజానా వేసుకొని ఫైట్ చేయడం తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు, దక్షిణాది సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు సినీ అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు స్పందిస్తున్నారు. ఒక సినిమా అనుభవాన్ని మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నిస్తున్నారు. హిందీలో గానీ, ఇతర భాషల్లో గానీ, మీరు ఎలాంటి పాత్రల్లో నటించారో ఒకసారి గుర్తు చేసుకోమంటూ రివర్స్‌లో కామెంట్స్ చేస్తున్నారు.


