తెలంగాణ

DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్

రచన: NK9 నిమిషాల పఠనం

DGP CV Anand: అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.

* వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి

• సీసీటీఎన్ఎస్ డేటా అప్‌డేట్ 96 శాతానికి చేరింది

• మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

• నెలవారీ నేర సమీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి

• ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి

* వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించాలి

* డీజీపీ కార్యాలయంలో అన్ని యూనిట్ల పోలీస్ సీనియర్ అధికారులతో అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం

* పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం

DGP CV Anand: అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా ప్రతి నేరం వెనుక కారణాలు, దర్యాప్తు తీరు, ఆయా కేసుల పరిష్కారాన్ని సమగ్రంగా విశ్లేషించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో గతంలో 70 నుంచి 80 శాతంగా ఉన్న సీసీటీఎన్‌ఎస్‌ డేటా అప్‌డేట్‌.. అధికారులు, సిబ్బంది కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయం అని డీజీపీ అన్నారు.

సమీక్ష సమావేశం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ కీలక సూచనలు చేశారు. ప్రతి నెల నిర్వహించే క్రైమ్‌ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలని, వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించాలని చెప్పారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్‌ ఐజీలు ఇకపై ఇన్‌స్పెక్షన్‌ నోట్స్‌ను పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. జిల్లాల పర్యటనలు, పోలీస్‌ స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

7.15% పెరిగిన నేరాలు..

రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో నేరాల సంఖ్య 7.15 శాతం పెరిగాయి. 2023-24లో 2,65,377 కేసులు నమోదవగా.. 2025-26లో 2,84,363కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. మూడేళ్లలో 46.10 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ట్రాఫిక్‌ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48 శాతం వృద్ధి చెందాయి.

తగ్గిన సైబర్, ఆర్థిక నేరాలు

అయితే సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు మాత్రం తగ్గాయని డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాలు 25,373 నుంచి 22 వేలకు తగ్గి 13.29 శాతం, ఆర్థిక నేరాలు 37,690 నుంచి 32,684కు తగ్గి 13.28 శాతం క్షీణించాయని తెలిపారు. తీవ్ర నేరాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా.. 2025-26లో 6,294కు తగ్గాయి.

పోలీస్ శాఖకు సవాల్ గా నార్కోటిక్ కేసులు

రాష్ట్రంలో నార్కోటిక్‌ కేసుల పెరుగుదల పోలీస్‌ శాఖకు ప్రధాన సవాల్ గా మారింది. 2023-24లో 2,026 కేసులు ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. కమిషనరేట్లలో సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్‌లోనూ మూడేళ్లలో 142.31 శాతం పెరిగాయి. జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కు కేసులు పెరిగాయి. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123కు పెరిగాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ గణాంకల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లలో నార్కోటిక్‌ కేసులు 46.10% పెరుగుదల నమోదైంది.

మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు

మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గాయి. 2024-25లో 31,593గా ఉన్న నేరాల సంఖ్య.. 2025-26లో 31,108కు తగ్గింది. ఈ ఏడాదిలో 1.54 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ, 2023-24తో పోలిస్తే కేసుల సంఖ్య ఇంకా 3.81 శాతం అధికంగానే ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్ల పరిధిలో కేసులు తగ్గగా, 'ఫ్యూచర్ సిటీ'లో మాత్రం కేసుల సంఖ్య 790 నుండి 994కు పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగు జిల్లాల్లో పెరుగుదల నమోదైంది.

పెరుగుతున్న ట్రాఫిక్ క్రైమ్స్

రాష్ట్రంలో ట్రాఫిక్‌ నేరాలు పెరుగుతున్నాయి. 2023-24లో 29,130 కేసులు ఉండగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయి. సైబర్‌ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు విభాగాల్లో మూడేళ్ల కాలానికి తగ్గుదల కనిపించడం సానుకూల పరిణామంగా పోలీస్‌ శాఖ భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్‌, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్‌ నేరాల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేరాలపై లోతైన విశ్లేషణ, నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

డిజిటల్‌ పోలీసింగ్‌ పోర్టళ్లలో సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అప్ డేట్ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సమయానుకూలంగా, కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్న పోలీసు యూనిట్ల పనితీరును ఆయన అభినందించారు. ఇతర యూనిట్లు కూడా ఇదే విధానాన్ని పాటించి పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐ ఆధారిత పోలీసింగ్‌ అప్లికేషన్లు, సీసీటీఎన్‌ఎస్‌, టీజీ-కాప్‌, హాక్‌ఐ తదితర డిజిటల్‌ వేదికల పనితీరు, వినియోగంపై అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు.

#DGP CV Anand#Telangana Police#Crime Control#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి