Delhi: రోడ్ల అభివృద్ధిని పరిశీలిస్తున్న సమయంలో ఒక యువకుడు సమస్యలపై నిలదీయగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయి అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ ఢిల్లీ పరిధిలో రహదారి పనుల పరిశీలన నిమిత్తం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ పాల్గొన్నారు. అదే సమయంలో సాహిబ్ అనే లోకల్ యువకుడు తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ, వేస్తున్న రోడ్ల నాణ్యత ఏమాత్రం బాగోలేదని, నాసిరకంగా ఉన్నాయంటూ మంత్రిని నేరుగా ప్రశ్నించాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పర్వేశ్ వర్మ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆ యువకుడి చెంపపై బలంగా కొట్టారు. ప్రజాప్రతినిధిగా ఉండి బహిరంగంగా ఒక పౌరుడిపై చేయి చేసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మంత్రి తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. "ప్రజాస్వామ్యంలో మంత్రులు తమను తాము రాచరికపు రాజుల్లా భావిస్తున్నారు.. ప్రశ్నించే గొంతులపై భౌతిక దాడులు చేస్తారా?" అని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.
అటు ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. "బీజేపీ మంత్రి ప్రజాసేవకుడిలా కాకుండా గూండాలా ప్రవర్తించారు" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.










