తెలంగాణ

BJP: మిషన్ తెలంగాణపై కాషాయ దళం సర్జికల్ ఆపరేషన్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ లీక్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

BJP: తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తున్న బీజేపీ పార్టీ తన కార్యాచరణను అనూహ్యంగా మార్చేసింది. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో సమానమైన బలం లేదన్న వాస్తవాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

BJP: తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తున్న బీజేపీ పార్టీ తన కార్యాచరణను అనూహ్యంగా మార్చేసింది. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో సమానమైన బలం లేదన్న వాస్తవాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

ముఖ్యంగా పార్టీ ఉనికికే సవాలుగా మారిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఇక తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు అత్యంత సన్నిహితుడైన కీలక నేతను నేరుగా రంగంలోకి దించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

ఆ మూడు జిల్లాల్లో పట్టు చిక్కకపోతే అధికారం అసాధ్యం

గత ఎన్నికలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓట్ షేర్ పెరిగినప్పటికీ, అది కొన్ని బలమైన ప్రాంతాలకే మాత్రమే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల విషయానికి వచ్చేసరికి కాషాయ పార్టీ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ మూడు జిల్లాల్లో ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ ప్రాంతాల్లో పాగా వేయకుండా తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యమని క్లారిటీకి వచ్చిన అధిష్ఠానం.. ఇప్పుడు ఇక్కడే ప్రయోగాత్మకంగా ‘ట్రయల్ రన్’ స్టార్ట్ చేయాలని భావిస్తోంది.

వరంగల్ కేంద్రంగా మాస్టర్ ప్లాన్..

ఈ ప్రాంతాన్ని గాడిన పెట్టేందుకు పార్టీ అంతర్గత వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణంలో నిపుణుడైన దశరథ్‌ను కాషాయ దళం వరంగల్ కేంద్రంగా మోహరించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు నమ్మినబంటుగా పేరున్న దశరథ్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. స్థానిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండేలా తెలుగు తెలిసిన నాయకులకు సంస్థాగత ప్రధాన కార్యదర్శుల బాధ్యతలు అప్పగించడంలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. బలహీనంగా ఉన్న డివిజన్లు, మండలాల్లో పార్టీని పరుగులు పెట్టించడమే ఆయనకు అప్పగించిన ప్రధాన టాస్క్ అని సమాచారం. అధిష్ఠానం స్వయంగా పంపించిన నేత కావడంతో క్షేత్రస్థాయి నిర్ణయాల్లో దశరథ్ మాటకే తిరుగుండదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుతో సెమీఫైనల్స్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేడర్‌ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి త్వరలోనే తొలి పరీక్ష ఎదురుకానుంది. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికను సెమీఫైనల్స్‌గా మార్చుకోవాలని కాషాయ దళం వ్యూహరచన చేస్తోంది. విద్యావంతులు, ఉద్యోగ వర్గాల్లో బీజేపీకున్న సానుకూలతను ఓట్లుగా మలచుకుంటూనే, సంస్థాగత బలహీనతలను అధిగమించాలని భావిస్తోంది.

రాష్ట్రంలో పార్టీ బలాలు, బలహీనతలపై ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఒక రిపోర్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూడు జిల్లాలపై మొదలుపెట్టిన ప్రత్యేక ఆపరేషన్ ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ స్పష్టం చేయనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ప్రయోగం కాషాయ దళానికి ఎలాంటి బలాన్ని ఇస్తుందో చూడాల్సిందే అని అంటున్నారు.

#BJP#Telangana BJP#Telangana Politics#BJP Master Plan#Mission Telangana#Warangal#Khammam#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి