సినిమా

Pan-India Hype: మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్స్.. పెద్ద సినిమాల బాగోతం!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Pan-India Hype: సినిమా మొదలయ్యేటప్పుడు ‘పాన్ ఇండియా సెన్సేషన్’ అంటారు. రిలీజ్‌కు ముందు నగరాలు చుట్టేస్తూ ‘ఇలాంటి విజువల్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు’ అని మైకులు పగలగొడతారు. కట్ చేస్తే.. ఫస్ట్ షో ముగిసేసరికే థియేటర్ల ముందు జనం ముఖాలు మాడిపోతాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద మొదలవుతుంది.

Pan-India Hype: సినిమా మొదలయ్యేటప్పుడు ‘పాన్ ఇండియా సెన్సేషన్’ అంటారు. రిలీజ్‌కు ముందు నగరాలు చుట్టేస్తూ ‘ఇలాంటి విజువల్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు’ అని మైకులు పగలగొడతారు. కట్ చేస్తే.. ఫస్ట్ షో ముగిసేసరికే థియేటర్ల ముందు జనం ముఖాలు మాడిపోతాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద మొదలవుతుంది. ఈ తంతు ఈనాటిది కాదు. ఇటీవల కాలంలో భారీ చిత్రాల పట్ల సర్వసాధారణమైన బాగోతంగా మారిపోయింది. ప్రచారంలో ఉన్న ఆర్భాటం కంటెంట్‌లో ఉండకపోవడం, స్క్రీన్ మీద మ్యాటర్ ఏమీ లేకపోయినా పబ్లిసిటీతో పీక్స్‌కు తీసుకెళ్లడం వల్ల బాక్సాఫీస్ వద్ద కోట్లు కుమ్మరించిన సినిమాలు కుదేలవుతున్నాయి.

పేపర్‌పై గారడీ.. స్క్రీన్ మీద డొల్ల

ఏ సినిమా ఫెయిలైనా వెంటనే "కథ బాగాలేదు" అనే ఒక ముద్ర వేసేసి చేతులు దులుపుకుంటారు. కానీ అసలు విలన్ కథ కాదు, కథనం, ఎగ్జిక్యూషన్. పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతోనూ కేవలం స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా నడిపించి వేల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో కోట్ల విలువైన ఇంట్రెస్టింగ్ పాయింట్లను తీసుకుని, సీన్ల మధ్య సరైన కనెక్టివిటీ లేక అట్టర్‌ప్లాప్ అయిన మాస్టర్‌పీస్‌లూ ఉన్నాయి. డైరెక్టర్ తలలో ఉన్న కథ ఆడియన్ గుండెకు తాకాలి. పేపర్ మీద రాసుకున్న విజువల్ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ మీద తేలిపోతే, ఆడియన్ నుంచి ఆదరణ దక్కదు.

షూటింగులకు ఏళ్లు.. పోస్ట్ ప్రొడక్షన్‌కు వారాలు

పెద్ద సినిమాల మేకర్స్ చేసే అతిపెద్ద నిర్లక్ష్యం పోస్ట్ ప్రొడక్షన్‌ దగ్గర బయటపడుతుంది. ఫారిన్ లొకేషన్లు, భారీ సెట్లు అంటూ హీరోల డేట్లతో రెండేళ్లు, మూడేళ్లు షూటింగులు లాగుతారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడేసరికి హడావుడిగా ఎడిటింగ్ టేబుల్ ఎక్కుతారు. ఏ సీన్ ఉండాలో, ఏ ల్యాగ్ లేపేయాలో తెలియక గందరగోళంలో పడతారు. వీఎఫ్ఎక్స్ కంపెనీలను చివరి నిమిషం వరకు ఉక్కిరిబిక్కిరి చేయడంతో నాసిరకం గ్రాఫిక్స్ తెరపైకి వస్తాయి. వందల కోట్ల బడ్జెట్ విజువల్స్ పచ్చిగా, నవ్వులపాలయ్యేలా కనిపిస్తాయి. ఆర్ఆర్ (రీ-రికార్డింగ్), సౌండ్ మిక్సింగ్ సరిగ్గా సింక్ కాకముందే ఓవర్సీస్ ప్రీమియర్ల కోసం హార్డ్ డిస్కులు ఫ్లైట్ ఎక్కించేస్తారు. ఈ ఆత్రుత, హడావుడి వెనుక కేవలం రిలీజ్ డేట్ డెడ్‌లైన్ తప్ప సినిమా క్వాలిటీ పట్టించుకునే తీరిక మేకర్స్‌కు ఉండటం లేదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ఓవర్ హైప్.. జేబులకు చిల్లులు

ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం చిన్న విషయం కాదు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, పాప్‌కార్న్ ఖర్చులు కలుపుకుంటే ఒక కుటుంబానికి వేలల్లో ఖర్చవుతోంది. ఇంత భారీగా ఖర్చు చేసి థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్‌కు.. రిలీజ్ ముందు టీమ్ ఇచ్చిన ‘ఓవర్ హైప్’ స్టేట్‌మెంట్లు గుర్తుకొస్తాయి. తెరపై చిన్న లోపం కనిపించినా, కంటెంట్‌లో డొల్లతనం బయటపడినా ఆడియన్ ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఫస్ట్ షో నుంచే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో నెగెటివిటీని బాంబులా పేలుస్తున్నారు.

స్టార్ల ఇమేజ్, ఈవెంట్ల గోల, సోషల్ మీడియా పీఆర్ స్టంట్లు మొదటి రోజు ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టగలవేమో గానీ.. రెండో రోజు నుంచి సినిమాను నిలబెట్టేది స్క్రీన్ మీద ఉండే మ్యాటర్ మాత్రమే. పబ్లిసిటీని పీక్స్‌లో ఉంచి, కంటెంట్‌ను గాలికొదిలేసే ఈ బాగోతాన్ని ఇప్పటికైనా మేకర్స్ మార్చుకోకపోతే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బలు తప్పవని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

#Pan-India Movies#Indian Cinema#Telugu Cinema#Movie Hype#Movie Publicity#Box Office#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి