రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటా మొత్తాన్ని ప్రభుత్వం గత నెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కొందరు లబ్దిదారులు రేషన్ తీసుకోలేదని తెలిసి ఈనెల 5 వరకు పంపిణీ గడువు తేదీని పొడగించింది.
కాగా,నేటి సాయంత్రం గడువు ముగియనుంది. రేషన్ తీసుకోనివారు వెంటనే వెళ్లితీసుకోవాలని లేదంటే మళ్లీ నవంబర్ నెలలోనే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో మరో రెండు నెలల పాటు లబ్ధిదారులు ఎదురుచూడాల్సిందే.ఇదిలాఉండగా, గోదాముల్లో బియ్యం నిల్వలు అధికంగా పేరుకుపోవడం,ఎల్ నినో కారణం చేత లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించాయి.
అయితే, ఒకేసారి 3 నెలల కోటా ఇవ్వడంతో గత నెల రోజుల పాటు రేషన్ షాపుల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. మరోవైపు సర్వర్ సమస్యలు తలెత్తడంతో పలువురు లబ్దిదారులకు రేషన్ అందలేదని తెలిసింది. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ గడువును పొడగించగా.. నేటి సాయంత్రంతో అది ముగియనుంది. ఎవరైనా ఇప్పటికీ తీసుకోని వారు ఉంటే ఇవాళ సాయంత్రంలోపు తమ కోటాను పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత మూడు నెలల కోటాను తిరిగి పొందే అవకాశం ఉండదని అధికారులు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (e-PoS) మెషిన్ల ద్వారా మూడు నెలల కోటా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగిందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. మరోవైపు గోదాముల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, కొత్త ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది రాకుండా ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.












