నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
నేపాల్ వరదల్లో ఇప్పటివరకు సుమారు 1300 మంది మరణించగా.. 4 వేలకు మందికి పైగా ప్రజలు గల్లంతైనట్టు అధికారులు అంచనా వేశారు. ఆస్తి, మౌలిక వసతుల నష్టం దాదాపు $2.56 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. కనీసం 7,500 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, మొత్తం సుమారు 20,000 ఇళ్లను పునర్నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
కనీసం 11–12 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు రహదారులు, ఇతర మౌలిక వసతులు పూర్తిగా తెగిపోయాయి. వివిధ హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ వరదల కారణంగా మొత్తంగా 84,000 మందికి పైగా ప్రజలు ప్రభావితం అయ్యారని, వారికి తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఇదిలాఉండగా, నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. దార్చులా జిల్లా అపి హిమల్ రూరల్ ప్రాంతంలో భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.అవి చౌలానీ నది ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
https://x.com/pulsenewsbreak/status/2096052193116004508?s=20
వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లేదంటే మరో ఉపధ్రవం వాటిల్లనుందని తెలుస్తోంది.










