దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో భారీ పేలుడు కలకలం రేపింది.. రాజధాని లాపాజ్ సమీపంలోని ఓ మిలటరీ బ్యారక్స్‌లో ఒక్కసారిగా సంభవించిన పేలుడు.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లాపాజ్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాచా మున్సిపాలిటీ పరిధిలోని సైనిక స్థావరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్క సారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైనిక యూనిట్‌లో టపాసులు, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ పేలుడుకు మరేదైనా కారణం ఉందా అనే అంశం పై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ పేలుడు తీవ్రతకు మిలటరీ బ్యారక్స్ నుంచి దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడింది.
మరోవైపు ఈ ప్రమాదంలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య 10 నుంచి 15 మధ్య ఉండొచ్చని స్థానిక ఆరోగ్య శాఖ డైరెక్టర్ రీటా నెబ్రాస్కా వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో అత్యధికంగా సాధారణ పౌరులే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ప్రభావంతో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై బొలీవియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, నిల్వ చేసిన పేలుడు పదార్థాల భద్రత, ఘటన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణకు ఆదేశించింది. కాగా ప్రస్తుతం బొలీవియాలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.









