తెలంగాణ

నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసింది- హరీశ్ రావు

రచన: NK••6 నిమిషాల పఠనం

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేవలం 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమే అని మండిపడ్డారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేవలం 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమే అని మండిపడ్డారు. శనివారం పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగులు హరీశ్ రావుని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగాల జాతర అంటూ ఓట్లు వేయించుకున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపి, ఓట్లు వేయించుకుని, ఇప్పుడు నామమాత్రంగా పోస్టులు ప్రకటించడం అంటే యువతకు ద్రోహం చేయడమే అని వ్యాఖ్యానించారు.

లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం ఎలా?

కేవలం 7 వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చేశారని విమర్శించారు. అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తాజా కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఒక్కటి కూడా కేటాయించలేదని హరీశ్ రావు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలు అత్యవసరం

చార్మినార్ జోన్ పరిధిలో సబ్‌-ఇన్‌స్పెక్టర్ పోస్టులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలు అత్యవసరం అని తేల్చి చెప్పారు. అయినా ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని హరీశ్ రావు వాపోయారు.

2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం

2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇప్పుడు విడుదల చేసిన అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేదన్నది సుస్పష్టం అన్నారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల అవేదన అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోస్టుల సంఖ్యను 25వేలకు పెంచాలి

పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది యువత తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తున్నారని.. వారి ఆశలను, ఆకాంక్షలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ ను కోరారు. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను 25వేలకు పెంచడంతో పాటు.. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఫ్యూచర్ సిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు పోస్టులు కేటాయించి నియామకాలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.

#Harish Rao#Brs#Telangana#Congress Govt#Police Constable Jobs#Unemployed Youth#Government Jobs#Swechaa News#Telangana Police Jobs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి