TSNPDCL: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటివరకు సాఫ్ట్వేర్, మెడికల్ రంగాల్లో ఎక్కువగా కనిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని విద్యుత్ పంపిణీ వ్యవస్థలోకి తీసుకొచ్చి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సంచలనం సృష్టించింది. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునిక ఏఐ సాంకేతికతను దేశంలోనే తొలిసారిగా సమర్థవంతంగా అమలు చేస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
ఫాల్ట్ ఎక్కడుందో లైన్మెన్లు వెతకాల్సిన పనిలేదు
గతంలో ఈదురుగాలులు, అకాల వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ లైన్లలో లోపాలు తలెత్తితే.. సమస్య ఎక్కడుందో గుర్తించడానికి లైన్మెన్లు కిలోమీటర్ల మేర స్తంభాల వెంట తిరగాల్సి వచ్చేది. కొన్నిసార్లు అసలు సమస్య ఎక్కడుందో తెలియడానికే గంటల సమయం పట్టేది. ఈ తలనొప్పికి ఎన్పీడీసీఎల్ ‘రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్’తో చెక్ పెట్టింది. 33 కేవీ, 11 కేవీ లైన్లలో 'ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను' అమర్చి, ఏఐ సాంకేతికతతో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. దీంతో ఎక్కడ లైన్ బ్రేక్ డౌన్ అయినా క్షణాల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరిపోతుంది. సిబ్బంది నేరుగా అదే ప్రాంతానికి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పరిష్కారం
వినియోగదారులు, రైతుల కోసం ప్రత్యేకంగా ‘కన్స్యూమర్ ఏఐ వాట్సాప్ బాట్’ సేవలను ప్రారంభించారు. కరెంట్ పోయినా లేదా బిల్లుల్లో తేడాలు వచ్చినా.. వినియోగదారుడు వాట్సాప్‌లో మెసేజ్ పంపితే చాలు. ఆ మెసేజ్ దేనికి సంబంధించిందో ఈ ఏఐ మాడ్యూల్ తనంతట తానే అర్థం చేసుకుంటుంది. వెంటనే సంబంధిత అధికారి మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌కు అలర్ట్ పంపి సమస్యను రిజిస్టర్ చేస్తుంది. అధికారి ఆ సమస్యను పరిష్కరించిన వెంటనే మళ్లీ వినియోగదారుడి వాట్సాప్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ అందుతుంది.
డ్రోన్లు, అనలిటిక్స్‌తో అన్నీ ఏఐ మయం
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ విభాగం రూపొందించిన ఈ విధానం సంస్థ రూపురేఖలనే మార్చేసింది. డ్రోన్లతో విద్యుత్ ఆస్తుల పర్యవేక్షణ, జీఐఎస్ ఆధారిత నెట్వర్క్, ఆటోమేటిక్ మీటర్ రీడింగ్, సబ్స్టేషన్ల లోడింగ్ అనలిటిక్స్ మాత్రమే కాకుండా భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను ముందస్తుగా అంచనా వేసేందుకు సైతం ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారు. 18 జిల్లాల్లోని లక్షలాది మంది వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ఎన్పీడీసీఎల్ చేపట్టిన ఈ విప్లవాత్మక మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


