Vidya Balan: హీరోయిన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే..లగ్జరీ లైఫ్..ఖరీదైన కార్లు..బంగళాలు..ఇలా ఎన్నో ఊహించుకుంటారు. కానీ, కొందరి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. చేతికందిన ముద్ద నోటి వరకూ వచ్చి పడిపోయినట్టుగా వచ్చిన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అలాంటి, జీవితాన్ని అనుభవించింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఎన్నో అవమానాల మధ్య స్టార్ స్టేటస్ దక్కించుకుంది..ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరుగా నిలబడింది.
కెరీర్ ప్రారంభంలో క్రేజీ ఆఫర్స్:
విద్యాబాలన్ కెరీర్ చాలా చిన్న తనంలో మొదలైంది. హిందీ, బెంగాలీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ వీడియోలు, పలు టీవీ సీరియల్స్ బాగా గుర్తింపును తెచ్చాయి. అంతేకాదు, పలు రకాల కమర్షియల్ యాడ్ ఫిలింస్ కూడా చేసి పాపులర్ అయింది.
అయితే, ఇదంతా క్రేజ్ వచ్చాక. వాస్తవానికి, విద్యాబాలన్ 16 ఏళ్ళ వయసులోనే ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఏక్తాకపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే హిందీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ ద్వారా బాలన్ కి బాగా గుర్తింపు రావడమే కాకుండా, ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అప్పట్లో, హిందీ సీరియల్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇలా, సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలన్‌కి, హీరోయిన్ అవ్వాలనే కోరిక కలగడంతో, ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పిందట. ఒప్పుకున్న వాళ్ళు ఓ కండీషన్ పెట్టారట. చదువు పూర్తయ్యాకే ఇండస్ట్రీలోకి వెళ్లాలని తేల్చి చెప్పడంతో ముంబై యూనివర్సిటీ లో చేరి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ఇక, విద్యాబాలన్ గోల్ హీరోయిన్ అవడమే. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి మొదటగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కి జంటగా 'చక్రం' అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. అయితే, ఆమె బ్యాడ్ లక్ ఈ సినిమా ప్రొడక్షన్లో ఉండగానే ఆగిపోయింది.
అంతే, బాలన్ది ఐరెన్ లెగ్ అని డిసైడ్ చేసేశారు. అక్కడ్నుంచీ కోలీవుడ్ వచ్చింది. తమిళంలో 'రన్' అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. కానీ, ఇది కూడా చేజారింది. బాలన్ స్థానంలో మీరాజాస్మిన్ చేరింది. దీని తర్వాత 'మనసెల్లం' అనే సినిమాలోనూ బాలన్ హీరోయిన్గా అనుకొని తర్వాత త్రిష ను రీప్లేస్ చేశారు. ఇక, 2003లో 'కలారి విక్రమన్' అనే సినిమాను పూర్తి చేసినప్పటికీ, ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఇలా, పాపం బాలన్ సౌత్ లో నటించిన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలకి సైన్ చేస్తే, అవి వేరే హీరోయిన్స్‌తో రీప్లేస్ చేశారు. అయినా, హీరోయిన్ అవ్వాలనే గోల్ ని వదల్లేదు. అలా, 2005లో 'పరిణీత' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఇక్కడే, విద్యాబాలన్ లక్ చెక్ చేసుకుంది. సంజయ్ దత్ సరసనా!..అని ఆలోచించకుండా 'లగే రహో మున్నాభాయ్' సినిమాలో ఛాన్స్ వస్తే జాహ్నవి పాత్రను ఒప్పుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ్నుంచి బాలన్ డేట్స్ కోసం క్యూ కట్టని నిర్మాత లేడు. 'ది డర్టీ పిక్చర్' సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకదశలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర తారల్లో ఒకరిగా విద్యాబాలన్ క్రేజ్ సంపాదించుకుంది. కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలకి బాలన్ సినీ కెరీర్ ఓ పుస్తకం లాంటిది.


