Supreme Court: చేతిలో పెన్ను, కాగితం ఉంటే చాలు.. సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి ‘మేమూ జర్నలిస్టులమే’ అంటూ చెలామణి అయ్యే ధోరణిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెన్ను పట్టుకుని నాలుగు ముక్కలు రాసిన ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా ప్రకటించుకుంటూ పోతే అది సమాజానికే పెను ముప్పుగా మారుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది కేవలం మీడియా రంగానికే కాకుండా, యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థకే కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరించారు.
భావ ప్రకటన స్వేచ్ఛ అంటే హద్దుల్లేని లైసెన్సా?
ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఈ అంశంపై మరింత లోతైన ప్రశ్నను లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన మాట వాస్తవమే. అయితే ఆ స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని, సమాజంలో కనిపించిన ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకోవడానికి రాజ్యాంగం అనుమతిస్తోందా? అన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత లేని రాతలు, హద్దులు దాటిన ప్రవర్తన అసలైన జర్నలిజం విలువలను సైతం మంటగలుపుతున్నాయని న్యాయస్థానం పరోక్షంగా అభిప్రాయపడింది.
తెరపైకి తెచ్చిన అసలు సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనల కవరేజ్ సందర్భంగా ఫ్రీలాన్స్, స్వతంత్ర విలేకరులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, మహిళా రిపోర్టర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది. మీడియా సంస్థల గుర్తింపు (అక్రెడిటేషన్) ఉన్న జర్నలిస్టుల తరహాలోనే.. స్వతంత్రంగా రాసే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక రక్షణ, మార్గదర్శకాలు అమలు చేయాలని పిటిషనర్లు గట్టిగా వాదించారు.
జవాబుదారీతనం లేని రాతలకు రక్షణ ఎలా?
పిటిషనర్ల వాదనలను పరిశీలిస్తూనే, స్వతంత్ర జర్నలిజం ముసుగులో చెలామణి అవుతున్న నియంత్రణ లేని విచ్చలవిడితనంపై న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సంస్థాగత జవాబుదారీతనం, నైతిక నియమావళి లేకుండా.. తమకిష్టమొచ్చినట్లు రాస్తూ, పోస్టులు పెడుతూ ‘మేమూ ప్రెస్ వాళ్లమే’ అంటే రక్షణ కల్పించుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలుతుందనేది ధర్మాసనం భావనగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియా వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. నిజమైన జర్నలిజం విలువలకు, డిజిటల్ యుగంలో పుట్టుకొస్తున్న అనియంత్రిత రాతలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయాల్సిన సమయం వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పినట్లయింది.


