ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈసారి ఈ అత్యాధునిక లగ్జరీ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ సర్వీస్ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదే నెలలో ప్రారంభానికి సన్నాహాలు
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ఈ నెలలోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరు-ముంబై మధ్య నడవనున్న ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఏపీలోని రాయలసీమ మీదుగా పయనించనుంది. ఏపీలోని అనంతపురం, ధర్మవరం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించారు. దీంతో అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజలకు ముంబై, బెంగళూరు నగరాలకు ప్రయాణించడానికి అద్భుతమైన అవకాశం లభించనుంది.
4గంటల సమయం ఆదా
ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా మొత్తం 1,118 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది. రాయచూర్, వాడి, కలబురిగి, సోలాపూర్, పూణె, కళ్యాన్ స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. ఈ వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ ప్రయాణానికి దాదాపు 20గంటల సమయం పడుతుండగా, వందే భారత్ స్లీపర్ ద్వారా కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులకు 4గంటలు సమయం ఆదా కానుంది.
లగ్జరీ సదుపాయాలు
విమానాన్ని తలపించేలా ఇందులో లగ్జరీ సదుపాయాలు ఉండనున్నాయి. ఆటోమేటెడ్ సెన్సార్ డోర్లు, సీసీ కెమెరాలు, క్రాష్ ప్రూఫీ కోచ్ డిజైన్, కవచ్ భద్రతా వ్యవస్థ, యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు, అత్యాధునిక మరుగుదొడ్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై-బెంగళూరు మార్గంలో టికెట్ ధర సుమారు రూ.3,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తుండగా, రైల్వేశాఖ త్వరలోనే అధికారిక షెడ్యూల్, ధరలను ప్రకటించనుంది.


