నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య రగులుతున్న తీవ్ర యుద్ధ వాతావరణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఊహించని సంచలన షాక్ తగిలింది. దేశం కోసం నమ్మకంగా పనిచేయాల్సిన ఒక రష్యన్ సైనిక అధికారే తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడు. రహస్య సమాచారాన్ని ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌కు అందించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. రష్యా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 26ఏళ్ల లెఫ్టినెంట్ లెవ్ స్టుప్నికోవ్ (Lev Stupnikov) చేసిన ఈ విశ్వాస ఘాతుకం వల్ల ఏకంగా 300మంది రష్యన్ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు.
ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. బుడ్యోన్నీ మిలిటరీ అకాడమీ ఆఫ్ ది సిగ్నల్ కార్ప్స్లో విద్యనభ్యసించిన స్టుప్నికోవ్, డాన్బాస్ ప్రాంతంలోని వ్యూహాత్మక పట్టణం వుహ్లేదార్ను ఆక్రమించుకునేందుకు రంగంలోకి దిగిన రష్యన్ బెటాలియన్‌లో చీఫ్ సిగ్నల్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ముందు వరుసలోని సైనిక విభాగాలు, కమాండర్ల కదలికలు, డ్రోన్లు, నిఘా కెమెరాల సమాచారాన్ని పర్యవేక్షించే అత్యంత కీలకమైన స్థానంలో అతడు ఉన్నాడు.
పుతిన్ చర్యలతో కలత చెంది.. గూఢచారిగా మారి..
2022లో రష్యా ఉక్రెయిన్‌పై జరిపిన అమానుష దాడులు, అమాయక పౌరుల మరణాలను చూసి తీవ్రంగా కలత చెందిన స్టుప్నికోవ్.. పుతిన్ ప్రభుత్వ చర్యలను దుష్ట చర్యగా భావించి రహస్యంగా ఉక్రెయిన్ సైనిక నిఘా విభాగానికి గూఢచారిగా మారాడు.తూర్పు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఒక రాత్రి వేళ తనకు కడుపునొప్పి వచ్చిందనే నెపంతో తోటి సైనికుల నుంచి దూరంగా వెళ్లిన స్టుప్నికోవ్, రష్యన్ స్థావరాల ఖచ్చితమైన జిపిఎస్ కోఆర్డినేట్లను ఉక్రెయిన్ దళాలకు చేరవేసాడు.
ఆ సమాచారం ఆధారంగా ఉక్రెయిన్ జరిపిన భీకర క్షిపణి దాడిలో రష్యా కల్నల్ గుసేన్ ముసాయేవ్తో సహా డజన్ల కొద్దీ రష్యన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, వందలాది మంది దెబ్బతిన్నారు. దాడి అనంతరం ఉక్రెయిన్ నిఘా విభాగం సభ్యుడు పరిస్థితి గురించి ఆరా తీయగా.. ‘అక్కడంతా మాంసపు ముద్దలే మిగిలాయి’ అని స్టుప్నికోవ్ ప్రత్యుత్తరం ఇవ్వడం ఈ ఘాతుకం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది. సమాచారం అందించిన అనంతరం రష్యా సైనిక స్థావరం నుంచి తప్పించుకున్న స్టుప్నికోవ్.. నేరుగా ఉక్రెయిన్‌కు చేరుకున్నాడు.
ప్రస్తుతం పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రష్యన్ వలంటీర్ యూనిట్లో చేరిపోయాడు. కాగా, ఈ నిర్ణయం అతని వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసింది. అతడి భార్య లిజా కూడా అతడు స్వదేశానికి, తమ వివాహ బంధానికి ద్రోహం చేశాడని తీవ్రంగా ఆరోపించింది. నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ భీకర పోరులో రష్యా సైన్యంలోని లోపాలు, అధికారుల్లో నెలకొన్న అసంతృప్తి ఈ ఘటన ద్వారా ప్రపంచానికి తేటతెల్లమైంది.


