గోదావరి జలాలపై చంద్రబాబు కుట్ర..
రేవంత్ లోపాయికారీ మద్దతు!
సమ్మక్క సాగర్ కాదని.. పోలవరం నుంచే అనుసంధానానికి లేఖ
వారంలోనే ఎజెండా మార్పు.. కేంద్రం, ఏపీ అత్యుత్సాహం
బీఆర్ఎస్ హయాం నాటి ప్రతిపాదనలను కాంగ్రెస్ నీరుగార్చింది!
తెలంగాణ నీటి హక్కుల సాధనకై ప్రజా ఉద్యమం చేస్తాం: హరీశ్ రావు
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ హక్కులకు మరణ శాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మద్దతుతో చంద్రబాబు గోదావరి నదిని కబళించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బదులుగా 'పోలవరం' వద్దే చేపట్టాలని కోరుతూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ లోపాయికారి మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.
కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపారని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రమైన ద్రోహమని మండిపడ్డారు. ఈ అక్రమ కుట్ర వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు ఎత్తిచూపారు. ఈ నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాస్తే, కేవలం వారం రోజుల వ్యవధిలోనే అంటే అక్టోబర్ 13 నాటికి దానిని ఎజెండాలో చేర్చిన కేంద్రం.. నవంబర్ 3న సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వేగంగా జరుగుతున్న పరిణామాలకు నిదర్శనమన్నారు.
సమ్మక్క సాగర్ నుంచి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి నష్టం జరుగుతుందని, పోలవరం నుంచి అనుసంధానించి బొల్లేపల్లి రిజర్వాయర్ను నింపాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. బొల్లేపల్లి నింపితే ఏపీకి మేలు జరుగుతుందని, మరి తెలంగాణ ప్రాంతం ఎండబెడితే మీకెందుకు పట్టదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (ఎగువ ప్రాంతం) నుంచి చేపట్టాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంగీకరించాయని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి, ఏపీ అక్రమ ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు జీవనాడి అయిన గోదావరి జలాలను పొరుగు రాష్ట్రానికి దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, దీనిపై ప్రజా ఉద్యమం చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు.


