తెలంగాణ

కర్ణాటక ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పదాలు: హరీశ్ రావు ఫైర్!

రచన: Mamatha puppala•••6 నిమిషాల పఠనం

చంద్రబాబు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మేము దిగువన పోలవరం వద్ద గోదావరి నీళ్లను మళ్లించుకుంటాం.. మీరు ఎగువన ఆల్మట్టి డ్యామ్‌లో 16 టీఎంసీల కృష్ణా నీళ్లను నిలుపుకోండి, కానీ పోలవరం లింకు ప్రాజెక్టుకు మాత్రం మద్దతు ఇవ్వండి’ అంటూ చంద్రబాబు కర్ణాటక నేతలకు ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు.

  • తమిళనాడు పర్యటన వెనుక గోదావరి జలాల తరలింపు కుట్ర

  • ఛత్తీస్‌గఢ్ జలాల్లో తెలంగాణ వాటాకు గండి కొడుతున్న బాబు

  • దిగ్గజ ఇంజినీర్ కేఎల్ రావు ఆశయాలకు తూట్లు

  • ప్రభుత్వ చర్యలపై కేంద్ర మంత్రులు నోరు మెదపరేం

  • రేవంత్ రెడ్డి నిజాలు బహిర్గతం చేయాలి

  • నవంబర్ 3 సమావేశాన్ని అడ్డుకుంటాం: హరీశ్ రావు

 చంద్రబాబు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మేము దిగువన పోలవరం వద్ద గోదావరి నీళ్లను మళ్లించుకుంటాం.. మీరు ఎగువన ఆల్మట్టి డ్యామ్‌లో 16 టీఎంసీల కృష్ణా నీళ్లను నిలుపుకోండి, కానీ పోలవరం లింకు ప్రాజెక్టుకు మాత్రం మద్దతు ఇవ్వండి’ అంటూ చంద్రబాబు కర్ణాటక నేతలకు ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి ప్రవాహం తగ్గి, ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు, తెలంగాణ తాగునీటికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 అంతేకాకుండా, ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి "చేయి చేయి కలుపుదాం.. దక్షిణాదికి మేలు చేసుకుందాం" అని మాట్లాడటం వెనుక గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ ప్రాంతీయ రాజకీయం వెనుక జరుగుతున్న అసలు నిజాలేంటో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిర్గతం చేయాలని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో దిగ్గజ ఇంజనీర్ కేఎల్ రావు స్వయంగా గోదావరి-కావేరి లింకును ఇచ్చంపల్లి (తెలంగాణ ప్రాంతం) మీదుగా తీసుకెళ్లాలని ప్రతిపాదించారని, ప్రస్తుత పాలకులు ఆయన ఆశయాలకు, సైంటిఫిక్ పద్ధతులకు పూర్తిగా తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జాతీయ నదుల అభివృద్ధి సంస్థ (NWDA) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వినియోగించుకోని 148 టీఎంసీల జలాలను మళ్లించేందుకు ఈ ప్రాజెక్టును సిద్ధం చేయగా, అందులో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను చంద్రబాబు తన లేఖల ద్వారా దెబ్బతీస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికి ముఖం చాటేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం లింకు ప్రాజెక్టును ఎలా వేగంగా ముందుకు తీసుకెళ్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు ప్లాన్‌కు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తుంటే, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు.

 నవంబర్ 3న సమావేశాన్ని అడ్డుకుంటాం

తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టేలా కేంద్రం నవంబర్ 3న నిర్వహించనున్న సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, అది తెలంగాణ జాతికి జరిగే శాశ్వత ద్రోహమవుతుందని హరీష్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ జల దోపిడీని అడ్డుకోవడానికి చట్టసభలతో పాటు క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లోనూ పోరాడుతుందని స్పష్టం చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై కేంద్రానికి అధికారిక నిరసన లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

 

#HarishRaoPressMeet#GodavariCauveryLink#CBNKarnatakaDeal#RevanthReddyGovt#AlmattiDam16TMC#PalamuruWaterCrisis#TelanganaWaterRights2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి