Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పలువురు నాయకులను కలిసి మద్దతు కోరుతోంది. ఇప్పటికే సీపీఎం నేతలను కలిసిన కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజాగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదాండరామ్ తో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోదండరామ్ ను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థనపై కోదండరామ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు.
''2018 నుండి ప్రజాస్వామిక విధానంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, అందదండలు ఇస్తున్నారు కోదండరామ్. 2018 ఎన్నికల్లో కలిసి పని చేశాం. 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఆనాడు టీజేఎస్ పార్టీ, కోదండరామ్, వారి మిత్ర బంధం ప్రధాన భూమిక పోషించారు. నాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ప్రజల కోరిక మేరకు టీజేఎస్ తో ఒప్పందం పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాం, విజయం సాధించాం.
ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వారి భాగస్వామ్యం మేము కోరుతూ వచ్చాము, వారు ఇస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా నిజమైన తెలంగాణ వాది గొంతును కౌన్సిల్ లో వినిపించాలని.. కోదండరామ్ ను కౌన్సిల్ కు తీసుకెళ్లాం. ఎస్ఐఆర్ పై చేస్తున్న ప్రజా ఉద్యమంలో కూడా ఇండీ కూటమిలో కూడా టీజేఎస్ భాగస్వామిగా ఉంది. ఇదే ఒరవడిని కొనసాగించాలని, వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోదండరామ్ ను కోరాము'' అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి టీజేఎస్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, టీజేఎస్ నాయకులతో తెలంగాణ జన సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ సమావేశంలో ఏఐపిసి చైర్మన్ మధు యాష్కి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
''ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మమ్మల్ని కోరారు. మా రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. మేము ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర కమిటీని సంప్రదించే చేస్తాం. మా పార్టీ నిర్ణయం ఏదైనా రాష్ట్ర కమిటీలోనే తీసుకుంటాం'' అని కోదండరామ్ వెల్లడించారు.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సీపీఎం నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి వెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులతో వారు భేటీ అయ్యారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి రావాలని, రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


