TG: సద్దుల బతుకమ్మ పండగ వేళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని, ప్రకృతిని ప్రేమిస్తూ ఆడపడుచులను గౌరవించుకునే అద్భుతమైన వేడుక ఇదని కొనియాడారు.
చెట్లు, చేమలు, పూలను పూజించే ఇంతటి గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సొంతమని సీఎం అన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలంతా ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా సంతోషాల పూలవాన కురిపించాలని, అందరి ఇళ్లలో సిరిసంపదలు, సుఖశాంతులు నిండాలని, మన సంస్కృతి తరతరాలు ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు.
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుక మహిళల ఐక్యతను చాటిచెబుతుందని, ఎన్నో మంచి ఆలోచనలతో కూడినదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఇంతటి ఘనంగా పండుగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన ఆడబిడ్డల కోసం ప్రజా ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.


