US: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న లక్షలాది మంది భారతీయులకు ట్రంప్ సర్కార్ భారీ షాకిచ్చింది. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఎదురుచూసే టైంలో ఉద్యోగం పోకుండా అండగా నిలిచే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు రూల్స్‌ని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ఎత్తేసింది. గతంలో తాత్కాలిక ఊరటగా తీసుకొచ్చిన ఈ నిబంధనను ఇప్పుడు శాశ్వతంగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ తాజా దెబ్బతో ముఖ్యంగా హెచ్-4 వీసాలపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ జీవిత భాగస్వాములు తీవ్ర సంక్షోభంలో పడనున్నారు. హెచ్-1బీ వీసాదారుల భార్యలు లేదా భర్తలు అక్కడి కంపెనీల్లో పని చేయడానికి ఈ వర్క్ పర్మిట్ మాత్రమే ఆధారం. గతంలో రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా 540 రోజుల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ రూల్ రద్దు కావడంతో, రెన్యువల్ అప్రూవల్ చేతికి రాకముందే పాత పర్మిట్ గడువు ముగిస్తే చట్టబద్ధంగా ఒక్క రోజు కూడా కంపెనీలో కొనసాగే వీలుండదు. అంటే అప్లికేషన్ కాస్త ఆలస్యమైనా వెంటనే ఉద్యోగం వదులుకోవాల్సిందే. అయితే ఎఫ్-1 స్టెమ్ విద్యార్థులకు మాత్రం 180 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అమెరికా రూల్స్ ప్రకారం చట్టబద్ధంగా జీవిస్తున్న వలసదారులపై, ముఖ్యంగా హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో సేవలందిస్తున్న నిపుణులపై ఇది పెనుభారమని మాజీ వైట్‌హౌస్ సలహాదారు అజయ్ జైన్ భూటోరియా మండిపడ్డారు. ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది అప్లికేషన్లు సకాలంలో ప్రాసెస్ కాకపోతే వేలాది భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు హెచ్-1బీ వీసా పొడిగింపుల సమీక్షలో గత నిర్ణయాలకు ఇచ్చే ప్రాధాన్యతను పక్కనపెట్టాలని ప్రభుత్వం మరో ప్రతిపాదన తెచ్చింది. ప్రతిసారీ కొత్త దరఖాస్తులాగే అన్నింటినీ మళ్లీ పరిశీలిస్తే డాక్యుమెంటేషన్ భారం, జాప్యం విపరీతంగా పెరగడం ఖాయం. ప్రస్తుతం దీనిపై నవంబర్ 13 వరకు ప్రజల అభిప్రాయాలను కోరుతున్నారు. వర్క్ పర్మిట్ రద్దు, వీసా రూల్స్ కఠినతరం వంటి వరుస నిర్ణయాలతో అమెరికాలో ఉన్న భారతీయ నిపుణుల భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది.


