తెలంగాణ

TBJP: ఎమ్మెల్సీ బరిలో బీజేపీ బిగ్ ట్విస్ట్.. 25 మంది ఆశలు ఆవిరి!

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

TBJP: తెలంగాణలో త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానాలకు నగారా మోగనుంది.

TBJP: తెలంగాణలో త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానాలకు నగారా మోగనుంది. ఈ రెండు స్థానాల పరిధిలో ఏకంగా 60కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో, ఇక్కడ పట్టు సాధిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగుండదని భావించిన కమలదళం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయన్న ప్రచారంతో టికెట్ కోసం పోటీ పడ్డ దాదాపు 25 మందికి పైగా ఆశావహులకు బీజేపీ హైకమాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

క్యూ కట్టిన నేతలు..

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ బలం ఎక్కువగా ఉండటంతో, టికెట్ తమకే దక్కుతుందనే నమ్మకంతో 25 మందికి పైగా ఆశావహులు రంగంలోకి దిగారు. అధిష్టానం అధికారికంగా టికెట్ ఖరారు చేయకముందే చాలామంది నేతలు ప్రచారం కూడా షురూ చేసేశారు. ఫ్లెక్సీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు, ప్రత్యేకంగా యాప్‌లు తయారు చేయించడం మాత్రమే కాకుండా.. గేటెడ్ కమ్యూనిటీల చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ సాధనే లక్ష్యంగా లక్షల్లో ఖర్చు పెట్టి హడావుడి చేశారు.

రంగంలోకి రాష్ట్ర అధ్యక్షుడు..

అయితే టికెట్ రేసులో ఉన్న కొందరు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ పార్టీ పెద్దలను సంప్రదించగా, అక్కడి నుంచి వచ్చిన సమాధానంతో వారి గుండెల్లో రాయి పడింది. "ఇక మీ ప్రయత్నాలు ఆపేయండి.. అక్కడి నుంచి బరిలోకి దిగేది ఎవరో ముందే ఫిక్స్ అయిపోయింది" అంటూ నేరుగానే స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ నియోజకవర్గం నుంచి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పోటీ చేయడం దాదాపు ఖాయమైందనే సంకేతాలు ఇవ్వడంతో ఆశావహులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కమిటీల నివేదికల్లోనూ మెజారిటీ నేతలు రామచంద్రరావు వైపే మొగ్గు చూపారని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

చేసేది లేక నిట్టూరుస్తున్న నాయకులు

ఇంతకాలం పార్టీ గెలుపు కంటే తమ టికెట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి, ఓటర్ల నమోదు చేయించి తీరా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే బరిలో ఉంటారని తేలడంతో ఆశావహులు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. లోలోపల తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం ఉన్నప్పటికీ.. స్వయంగా పార్టీ అధ్యక్షుడే అభ్యర్థిగా వస్తుండటంతో ఎదురుతిరగలేక, ఆయన గెలుపు కోసమే పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని కమలం నేతలు నిట్టూరుస్తున్నారు. ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు తెలంగాణ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Telangana BJP#TBJP#MLC Elections#Graduate MLC Elections#N Ramchandra Rao#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి