తెలంగాణ

మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది- సీఎం రేవంత్

రచన: NK•••8 నిమిషాల పఠనం

Cm Revanth: హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీ అని, పెట్టుబడులకు సరైన నగరం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Cm Revanth: హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీ అని, పెట్టుబడులకు సరైన నగరం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక వసతులు మేము కల్పిస్తామన్నారు. మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్.. ఆ పెట్టుబడులకు తాను కస్టోడియన్ గా ఉంటానని చెప్పారు. మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని, డబుల్ లాభం ఖాయమని రేవంత్ అన్నారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం

డిసెంబర్ 7,8,9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు అందరినీ ఆహ్వానించారు. సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఉందని చెప్పారు. ఆనాడే ప్రపంచ దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చేవారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047.. తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక అన్న సీఎం రేవంత్.. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. హైదరాబాద్ కు పోటీ ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు కాదని.. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ తో పోటీ పడతామన్నారు.

ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్ర‌భుత్వం అండగా నిలుస్తుందని, రాష్ట్రంలో ప్రతి పెట్టుబడికి త‌న‌ది భ‌రోసా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. “పెట్టుబడుల విషయంలో విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం, అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా” అని పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారాయన. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, అవకాశాలు, సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవాలంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

రెట్టింపు లాభాలు ఖాయం

“పెట్టుబడిదారులకు ఒక విజ్ఞప్తి. తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని రెట్టింపు చేయండి. అందుకు మీరు ఆశిస్తున్న వృద్ధి రేటును, లాభాలనూ రెట్టింపు చేయండి. అందుకు నా నుంచి ఏం కావాలో చెప్పండి. తెలంగాణలో పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటాను” అని సీఎం రేవంత్ అన్నారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ 2026’లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలికారు సీఎం రేవంత్. “వ్యాపార రంగంలో నాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెడతాం. పారిశ్రామిక అవకాశాలను విస్తరించి పెట్టుబడిదారులకు తమ గమ్యంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే నా పని” అని రేవంత్ చెప్పారు.

నా లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

“వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాం. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. తెలంగాణ అభివృద్ధికి మీ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీరందించే సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తాం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలి” అని కోరారు.

తెలంగాణకు కేంద్రం సహకరిస్తోంది

కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “కేంద్ర ప్రభుత్వం దేశంలో 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, అందులో 3 హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్‌ - చెన్నై, హైదరాబాద్‌ - బెంగళూరు, హైదరాబాద్‌ - పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్రం తెలంగాణకు సహకరిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నాం” అని వివరించారు.

హైదరాబాద్ నగర చారిత్రక వైభవం, ఇక్కడి మౌలిక సదుపాయాలు, మేధోసంపత్తిని ఉదాహరణలతో వివరించారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ నగరం న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

#Cm Revanth#Telangana#Invest Telangana#Invest Telangana Global Summit 2026#Hyderabad#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి