UP: సినిమాల్లో గుప్తనిధుల కోసం నేల తవ్వితే బంగారు నాణేలు బయటపడటం చూసుంటాం. కానీ ఇక్కడ తవ్వుతున్న కొద్దీ కట్టల కొద్దీ ఐదొందల నోట్లు బయటపడ్డాయి. అది కూడా ఎక్కడో అడవుల్లో కాదు.. ఓ పల్లెటూరి పెంకుటింట్లో. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో వెలుగుచూసిన ఈ ‘3 బ్లూ డ్రమ్ముల’ కథ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. భూమిలో దాదాపు 15 అడుగుల లోతున గొయ్యి తీసి.. మూడు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోట్ల రూపాయల క్యాష్ దాచిపెట్టిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు.
చిన్న గొడవతో మొదలై.. డ్రమ్ముల దాకా వెళ్లింది
ప్రయాగ్రాజ్ గంగానగర్ జోన్ పరిధిలోని రామ్నగర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఊళ్లో వాళ్లతో చిన్న గొడవ జరగడంతో, ఈ సోదరుల ఇంట్లో ఏదో పెద్ద తతంగమే నడుస్తోందని పోలీసులకు ఉప్పందింది. నవాబ్గంజ్, సోరావ్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇల్లంతా చిందరవందరగా ఉన్నా, ఓ గది నేలపై మట్టి కాస్త వదులుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి కూలీలను పిలిపించి తవ్వడం మొదలుపెట్టారు.
15 అడుగుల లోతున.. నల్ల కవర్లలో చుట్టి
కూలీలు తవ్వుతూ పోతుంటే దాదాపు 15 అడుగుల (5 మీటర్లు) లోతు వద్ద పారకు ఏదో ప్లాస్టిక్ వస్తువు తగిలింది. జాగ్రత్తగా మట్టి తొలగించగా.. మూడు భారీ బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ములు బయటపడ్డాయి. తేమ తగలకుండా ఆ డ్రమ్ములకు నల్లటి ప్లాస్టిక్ కవర్లను చాలా జాగ్రత్తగా చుట్టి భద్రపరిచారు. సీల్ తీసి మూతలు తెరవగానే.. లోపల కిక్కిరిసి ఉన్న సరికొత్త రూ. 500 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది.
రూ. 10 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా
ఆ మూడు డ్రమ్ముల్లో ఉన్న డబ్బు దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అంత భారీ నగదును లెక్కించడానికి వీలుగా ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు కౌంటింగ్ మెషీన్లతో వచ్చి లెక్క తేల్చాల్సి ఉంది. అయితే ఆ సాధారణ పల్లెటూరి ఇంట్లోకి అంత సొమ్ము ఎలా వచ్చింది? ఇది హవాలా నెట్వర్కా లేక అక్రమ వ్యాపారాల నల్లధనమా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం ఈ ‘3 బ్లూ డ్రమ్ముల సీక్రెట్’ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.


