Cm Revanth: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించని తప్పులను కేసీఆర్ కుటుంబం చేసిందని ధ్వజమెత్తారు. కొడంగల్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
తెలంగాణను కొల్లగొట్టి లక్ష కోట్లు సంపాదించారు
''సారాయి నుంచి మొదలుపెడితే లిక్కర్, నీళ్లు, పాలు, భూములు, గనులు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాన్ని.. ఇంటిల్లిపాదిగా తెలంగాణను కొల్లగొట్టి లక్ష కోట్లు సంపాదించారు. లిక్కర్ వ్యాపారం సంతోష్ రావు తీసుకున్నారు. ఆంధ్రోళ్ల కంపెనీలకు పాలు అమ్మి, బ్లాక్ మెయిల్ చేసి హరీశ్ రావు వందల కోట్లు సంపాదించారు. భూములను కేటీఆర్, నీళ్లను కేసీఆర్ చెరబట్టారు. భూమి, ఆకాశం, గనులు, ఇసుక దేన్నీ వదల్లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. నేరెళ్ల బాధితులను లారీ కింద వేసి తొక్కించారు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించారు. వరి వేస్తే ఉరేసుకున్నట్లే అని రైతులను అవమానించారు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయారని అనుకుంటున్నారా?'' అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.
గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ కాలేవు..
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డంపైనా సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. కేటీఆర్ వేషభాషలు మార్చుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని కేటీఆర్ కు చురకలు అంటించారు. తనలా కావాలంటే కార్యకర్తలను గుండెలో పెట్టి చూసుకునే ధైర్యం కావాలని.. నమ్మిన వాళ్లను భుజాల మీద మోసే త్యాగం ఉండాలని కేటీఆర్ కు సూచించారు. నమ్ముకున్నోళ్లు ఏ కష్టంలో ఉన్నా, పిడుగు మీద పడ్డా, నమ్మినోళ్ల కోసం తాను నిలబడతానన్న సీఎం రేవంత్.. మూడేళ్లుగా గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్.
కాళేశ్వరరావు అని భజన చేయించుకున్నారు
''దగ్గరుండి కాళేశ్వరం కట్టించానని హరీశ్ గొప్పలు చెప్పుకున్నారు. తన పేరు హరీశ్ రావు కాదు కాళేశ్వరరావు అని భజన చేయించుకున్నారు. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోతే దానికి ఎందుకు బాధ్యత వహించడం లేదు? మేడిగడ్డ వద్ద వాళ్లను పాతిపెట్టడమే వాళ్లకు సరైన శిక్ష. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయకుంటే కన్నెపల్లి పంపులు పని చేయవు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లోనూ నీళ్లు నిల్వ చేయలేని దుస్థితి. మేడిగడ్డతో పని లేకుండా నీళ్లు ఎత్తిపోసేది ఉంటే.. మరి అది ఎందుకు కట్టినట్లు? లగచర్ల విషయంలోనూ అబద్దాలు చెప్పి రైతులను భయపెట్టారు.
మూడేళ్లకే కుప్పకూలిన కాళేశ్వరం
పదేళ్లలో పాలమూరు జిల్లాలో ఏ ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయలేదు. పదేళ్లలో రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ చేతికి వచ్చినా.. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. తెలంగాణ వరప్రదాయనిగా మారే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు నెట్టారు. ప్రాణహిత పేరు మార్చి, స్థలం మార్చి, అంచనాలు పెంచి కాళేశ్వరం కట్టారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకే కుప్పకూలింది'' అని సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. వచ్చే డిసెంబర్ లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి కోరుతున్నామన్న రేవంత్.. ఆ సమావేశాల్లో ఎల్నినో, కాళేశ్వరం అంశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.
చర్చకు సిద్ధం.. కేటీఆర్, హరీశ్ కు సవాల్
''మీ పాపాల వల్లే కరువు సమయంలో రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 22ఏ మీద కూడా అబద్దాలు చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే స్పీకర్ ను దుర్భాషలాడారు. అసెంబ్లీలో 22ఏ మీద చర్చ తర్వాత నోరు ఎత్తడం లేదు. ఎల్ నినో మీద అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. పాలమూరుకు సాగు, తాగు నీరు ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు.
కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అసత్యాలు చెబుతున్నారు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్లే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది. పాలమూరు ప్రజలపై కడుపు నిండా విషం నింపుకున్నారు. పాలమూరుకు ఇప్పటివరకు పెద్ద పదవులు రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు. నాకు మంత్రిగా పని చేసిన అనుభవం లేదు. కానీ ప్రజల ప్రతి సమస్య తెలుసు'' అని రేవంత్ రెడ్డి అన్నారు.


