జాతీయం

Sonia Gandhi: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తప్పే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు

6 నిమిషాల పఠనం

Sonia Gandhi: భారత రాజకీయ యవనికపై ఇప్పటికీ చెరగని మచ్చగా మిగిలిపోయిన 'ఎమర్జెన్సీ' వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఆ వివాదాస్పద నిర్ణయం ముమ్మాటికీ "ఓ చారిత్రక పొరపాటే" అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Sonia Gandhi: భారత రాజకీయ యవనికపై ఇప్పటికీ చెరగని మచ్చగా మిగిలిపోయిన 'ఎమర్జెన్సీ' వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఆ వివాదాస్పద నిర్ణయం ముమ్మాటికీ "ఓ చారిత్రక పొరపాటే" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. దేశాన్ని అతలాకుతలం చేసిన ఆ అంధకార కాలానికి తెరవెనుక అసలు సూత్రధారి ఎవరు? గాంధీ కుటుంబంలో డిన్నర్ టేబుల్ వద్ద నడిచిన తీవ్ర ఘర్షణలేంటి? అనే విస్తుపోయే రహస్యాలను ఆమె బహిర్గతం చేశారు. త్వరలో రాబోతున్న తన ఆత్మకథ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు 'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ నిజాలను బయటపెట్టారు.

డిన్నర్ టేబుల్‌పై రచ్చ..

ఎమర్జెన్సీ విధించే అంశంపై నాటి గాంధీ కుటుంబంలో తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, అంతర్గత కుమ్ములాటలు జరిగాయని సోనియా స్పష్టం చేశారు. ఈ కఠిన నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ ఆది నుంచే తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె గుర్తు చేసుకున్నారు. "వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఓపిక పట్టండి.. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరకు పదేపదే మొరపెట్టుకున్నారు. అయితే ఇందిర చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ విధించాల్సిందేనని మొండిపట్టు పట్టారు. "ప్రతిపక్షాలు నిన్ను నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాయి.. వాళ్లను ఇప్పుడే కట్టడి చేయకపోతే మన ఉనికే ఉండదు" అంటూ ఓ ఫ్యామిలీ డిన్నర్ సందర్భంగా సంజయ్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రాజీవ్ తన తల్లిని నిలదీసే ప్రయత్నం చేయగా, ఆమె ఆయన మాట వినేందుకు నిరాకరించారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. "ఆ సమయంలో సంజయ్‌ను గనక అదుపులో పెట్టి ఉంటే.. ఆ తర్వాత దేశానికి జరిగిన తీవ్ర నష్టాన్ని చాలా వరకు నివారించి ఉండేవారేమో" అని సోనియా గాంధీ బాహాటంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇందిరా గాంధీ డెమోక్రాట్.. కానీ

ఇందిరా గాంధీని ఒక నియంతగా చూసే వారికి సోనియా మాటలు ఆశ్చర్యం కలిగించవచ్చు. "నాటి పరిస్థితిలో ఇందిర స్వచ్ఛమైన ప్రజాస్వామ్యవాది అని చెబితే చాలామంది నవ్వుతారని నాకు తెలుసు. కానీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఆమె ఏమాత్రం ప్రశాంతంగా లేరు. మానసికంగా ఎంతో కుంగిపోయారు..ఎమర్జెన్సీ భారం ఆమెపై తీవ్రంగా ఉండేది" అని సోనియా చెప్పుకొచ్చారు. కేవలం చిన్న కుమారుడు సంజయ్ నుంచే కాకుండా, నాటి కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి కూడా ఇందిరపై విపరీతమైన ఒత్తిడి ఉండేదని ఆమె తెలిపారు. ఆమె చుట్టూ ఉన్న వారిలో రాజీవ్ మాదిరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవారని వివరించారు.

రాజ్యాంగబద్ధంగానే జరిగినా.. హక్కుల కాలరాశారు

ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన తర్వాతే అసలు ఏం జరుగుతోందో తనకు అర్థమైందని సోనియా పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం, హెబియస్ కార్పస్ హక్కును సైతం రద్దు చేయడం వంటి దారుణాలు కళ్లముందే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ ప్రక్రియ మొత్తం రాజ్యాంగ నిబంధనలకు లోబడే జరిగిందని స్పష్టం చేసిన ఆమె.. క్రమంగా ఆ తప్పును గుర్తించిన ఇందిరా గాంధీ స్వయంగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారని ముగించారు. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను ఇరకాటంలో నెడుతున్న ఎమర్జెన్సీ అంశంపై.. స్వయంగా సోనియా గాంధీ అంగీకరిస్తూ, సంజయ్ గాంధీ మొండివైఖరినే ప్రధాన కారణంగా వేలెత్తి చూపడం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెను దుమారానికి తెరలేపింది.

#Sonia Gandhi#Indira Gandhi#Emergency 1975#Indian Emergency#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి